23 May, 2026 | 9:54 PM

మొక్కజొన్న పంట డబ్బులు వెంటనే జమ చేయాలి

23-05-2026 08:51 PM

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్న పంటకు సంబంధించిన చెల్లింపులను ప్రభుత్వం వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు నాగం శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెండు నెలలుగా మొక్కజొన్న కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ రైతులకు డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు.

రైతులు అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి పండించిన పంటకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడం దారుణమన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లలో దళారుల దోపిడీ పెరిగిందని, క్వింటాలుకు అదనపు ఖర్చుల పేరుతో రైతులపై భారం మోపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ చెల్లింపులు విడుదల చేయాలని కోరారు. రైతు సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.