15 రోజుల్లో చోరీ కేసు ఛేదన బాధితులకు బంగారం అప్పగింత
అమీన్పూర్ పోలీసుల చాకచక్యం – నిందితుడి అరెస్ట్, 45 తులాల బంగారం రికవరీ
రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్, సీఐ పి. నరేష్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్
అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించి బాధితులకు దొంగిలించబడిన బంగారాన్ని తిరిగి అప్పగించారు. ఈ మేరకు రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 14వ తేదీన బందంకొమ్ము కాలనీలోని హిల్ టాప్ హోమ్స్‌లో వెంకటరమణ – భవాని దంపతులు ఇంట్లో లేని సమయంలో నిందితుడు మండ్ల శివ అలియాస్ ఎర్ర శివ ఇంట్లోకి చొరబడి సుమారు రూ.50 లక్షల విలువైన దాదాపు అరకేజీ బంగారాన్ని అపహరించాడు.
నిందితుడు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలానికి చెందినవాడని, జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి కూలీ పనులు చేస్తూ తరువాత దొంగతనాలకు అలవాటు పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై మల్కాజిగిరి, సైబరాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కలిపి మొత్తం 24 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అమీన్ పూర్ పోలీసులు కేవలం 15 రోజుల్లోనే కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. కోర్టు అనుమతితో బాధితులకు సుమారు 45 తులాల బంగారు ఆభరణాలను మీడియా సమక్షంలో తిరిగి అప్పగించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఏసీపీ శ్రీనివాస్ కుమార్ భద్రతపై పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, బయటకు వెళ్లే సమయంలో ఇంటి వెలుపల లైట్లు ఆన్‌లో ఉంచాలని సూచించారు. ఇంట్లో నగదు, బంగారం నిల్వ చేయకుండా లాకర్లలో భద్రపరచాలని చెప్పారు. అలాగే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని, హిల్ టాప్ హోమ్స్ కాలనీలో త్వరితగతిన సీసీ కెమెరాల వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, బాధితురాలు భవాని, కాలనీవాసులు పాల్గొన్నారు.






