కొత్తగూడెం శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కలకలం రేపింది. గ్రామస్థుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, మారోజు వీరన్న విగ్రహం క్రింద ఉన్న షెడ్‌లో సుమారు 45 ఏళ్ల వ్యక్తి మృతిచెందిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. మృతుడి వివరాలపై చుట్టుపక్కల విచారణ చేపట్టినా ఎలాంటి ఆచూకీ లభించలేదు.
మృతుడి వద్ద గుర్తింపు ఆధారాలు కూడా ఏవీ లభించలేదని ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీ గదిలో భద్రపరిచారు. మృతుడు ఆకుపచ్చ-తెలుపు రంగుల టీషర్ట్, బ్లూ గీతలు ఉన్న లుంగీ ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు 8712686036 నెంబర్ కు సమాచారం తెలపగలరని ఎస్సై అన్నారు.






