ఉపాధి హామీ పనుల పేరుతో ఈత చెట్ల దహనం.. గీత కార్మికుల ఆవేదన
తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో వివాదం
తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో ఉపాధి హామీ పనుల పేరుతో గీత కార్మికుల జీవనాధారమైన ఈత చెట్లను కాల్చివేసిన ఘటన వివాదానికి దారితీసింది. కాలవ కట్టలపై పెరిగిన ఈత మొక్కలు, చెట్లను అగ్నికి ఆహుతి చేయడంతో గీత కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా ఈత చెట్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమ పొట్టకొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
కల్లుగీత కార్మిక సంఘ అధ్యక్షుడు బోడపట్ల సతీష్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. “ఈత చెట్లు కేవలం మొక్కలు కావు.. వందలాది కుటుంబాల జీవనాధారం” అంటూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కాల్చివేసిన ఈత మొక్కలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
గ్రామంలోని గౌడ కులస్తులు కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉపాధి హామీ పనులు పేదల జీవనాధారాలను నాశనం చేసే విధంగా ఉండకూడదన్నారు. అయితే గ్రామపంచాయతీ సెక్రటరీ స్పందిస్తూ ఈ ఘటనకు గ్రామపంచాయతీ సిబ్బంది లేదా ఉపాధి హామీ కూలీలకు సంబంధం లేదని, పక్కనే ఉన్న రైతు పంట అవశేషాలు కాల్చిన సమయంలో అనుకోకుండా మంటలు వ్యాపించి ఘటన జరిగి ఉండొచ్చని తెలిపారు.






