1న టేక్ ఓవర్
- మెట్రో రైలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- నెలాఖరులోగా డీల్ పూర్తిచేయాలని లక్ష్యం
- నిర్వహణ బోర్డ్ చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణారావు
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో రైలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రైవేట్ భాగస్వామ్య సంస్థ ఎల్‌అండ్‌టీ చేతిలో ఉన్న వాటాలన్నీ స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 30లోగా సుమారు రూ.15 వేల కోట్ల డీల్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానున్న ది.
ఈ మార్పుల నేపథ్యంలో మెట్రో రైలు బోర్డులో కీలక నియామకాలు కూడా పూర్తిచేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ-, ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో నడుస్తున్న ఈ ప్రాజెక్టులో ఎల్‌అండ్‌టీ మెట్రోకు ఉన్న 100 శాతం ఈక్విటీని ప్రభుత్వం సొంతం చేసుకున్నది. దీంతో మెట్రో రైలు పూర్తిస్థాయిలో ప్రభుత్వ యాజమాన్యం కిందికి వచ్చింది. మెట్రో నిర్వహణ, యాజమాన్య బదిలీ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కొత్త బోర్డు ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది.
మెట్రో భవిష్యత్తు ప్రణాళికలు, విస్తరణ, నిర్వహణ బాధ్యతలను ఈ కొత్త బోర్డు పర్యవేక్షించనున్నది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును బోర్డు చైర్మన్‌గా నియమించింది. మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ కొనసాగనున్నారు. అలాగే బోర్డు డైరెక్టర్లుగా జయేశ్‌రంజన్, వికాస్ రాజ్, ఫైనాన్స్ సెక్రటరీ సుల్తానియా, శివధర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ, విస్తరణ, భవిష్యత్తు ప్రణాళికలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానున్నాయి. షేర్ అలాట్మెంట్‌కు కూడా ఆమోదం లభించినట్టు తెలుస్తున్నది.






