అధిక ఫీజుల దోపిడీపై చలో ఇందిరా పార్క్
నేడు టీఆర్పీ ఆధ్వర్యంలో మహా ధర్నా
విద్యాహక్కు చట్టం 2009 అమలుకు టీఆర్పీ డిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా, విద్యాహక్కు చట్టం 2009ను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు.
ఈ ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. తల్లిదండ్రులపై ఫీజుల భారం భరించలేనిదని, ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ విద్యాసంస్థలు విధిస్తున్న అధిక ఫీజుల వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
కుటుంబ వార్షిక ఆదాయంలో దాదాపు 70 శాతం వరకు పిల్లల విద్యకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్పొరేట్ విద్యా వ్యవస్థ తీరుపై తీవ్ర విమర్శలు కురిపించారు.రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కలిసి విద్యాసంస్థలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి, లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. విద్యను వ్యాపారంగా మార్చిన ఈ వ్యవస్థను తక్షణమే నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యాహక్కు అమలు చేయడంలో వైఫల్యం..
రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుపై ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని మల్లన్న ఆరోపించారు. ఈ చట్టాన్ని సమర్థంగా అమలు చేస్తే, ప్రతి ప్రైవేట్/కార్పొరేట్ పాఠశాలలో 25% సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది అని తెలిపారు. ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్ల నుంచి లంచాలు తీసుకుంటూ, ఉద్దేశపూర్వకంగా విద్యాహక్కు చట్టం అమలు కాకుండా అడ్డుకుంటోందని, ఈ ఫీజుల దోపిడీలో ప్రభుత్వం కూడా భాగస్వామ్యమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారీ ఎత్తున ధర్నాకు సిద్ధం..
ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కోరు తూ ఆదివారం ఉదయం 10 గంటలకు ఇం దిరా పార్క్ వద్ద వేలాది మంది తల్లిదండ్రులతో కలిసి భారీ ధర్నా నిర్వహించను న్నట్లు తెలిపారు. ఇది విద్యా రంగంలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్య మంగా నిలుస్తుందన్నారు.ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి గురవుతున్న ప్రతి తల్లిదండ్రి ఈ ఉద్యమంలో పాల్గొని తమ హక్కుల కోసం గళమెత్తాలని మల్లన్న పిలుపునిచ్చారు. విద్య హక్కు వ్యాపారం కాదు అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని టీఆర్పీ పిలుపునిచ్చింది.






