శివారు ఫామ్‌హౌస్‌లు.. నేరాలకు అడ్డాలు!
- పరాయి రాష్ట్రాల ముఠాల చేతిలో బలవుతున్న తెలంగాణ వాసులు
- డ్రగ్స్, ముజ్రా పార్టీలు, దొంగతనాలతో వణుకుతున్న చేవెళ్ల పరిధి
- డొమెస్టిక్ సర్వెంట్ల వివరాలు సేకరించాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశం
చేవెళ్ల, జూన్ 12 (విజయక్రాంతి): తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతాలు క్రమంగా నేరగాళ్లకు, విచ్చలవిడి సంస్కృతికి అడ్డాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు ధాన్యపు రాశులతో కళకళలాడిన పచ్చని గ్రామీణ ప్రాంతాలు.. నేడు డ్రగ్స్, గంజాయి, ముజ్రా పార్టీలు మరియు హత్యల వంటి ఫాసిస్టు ధోరణులకు కేంద్రాలుగా మారుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కొన్ని ముఠాలు ఇక్కడి అమాయక ప్రజలను బలిపశువులను చేస్తూ, నేరాలకు ఒడిగట్టి స్వరాష్ట్రాలకు పారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన డీజీపీ సీవీ ఆనంద్.. ఇటీవలి స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశంలో శివారు ప్రాంతాల్లోని ఇళ్లలో పనిచేసే డొమెస్టిక్ సర్వెంట్లు, ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలను పూర్తిగా సేకరించాలని పోలీసులను ఆదేశించారు.
ఫామ్హౌస్ కల్చర్.. డ్రగ్స్, ముజ్రా పార్టీలు..
నగర శివారుల్లో పాశ్చాత్య సంస్కృతి పేరిట ఫామ్హౌస్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. వీకెండ్స్ (వారాంతాల్లో) ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి అర్ధనగ్న ప్రదర్శనలు, ముజ్రా పార్టీలు నిర్వహిస్తున్న ఉదంతాలు వరుసగా వెలుగుచూస్తున్నాయి.
ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు జరుపుతున్న దాడుల్లో గంజాయి, హుక్కా, కొకైన్, హెరాయిన్ వంటి ప్రమాదకర డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. ఈ వ్యవహారాల్లో రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖుల పిల్లలు, సంపన్న కుటుంబాల వారితో పాటు మధ్యతరగతి యువత కూడా చిక్కుకుపోవడం కలకలం రేపుతోంది.
పశువుల చోరీ.. విదేశాలకు మాంసం ఎగుమతి..
కేవలం డ్రగ్స్, పార్టీలే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఇక్కడి రైతులు ప్రాణప్రదంగా సాదుకునే పాడి పశువులను ముఠాలు దొంగిలిస్తున్నాయి. ఇలా దొంగిలించిన పశువులను విదేశాలకు మాంసం ఎగుమతి చేసే ’అల్ఖాబీర్’ వంటి వధశాలలకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది రంజాన్ మాసంలో చేవెళ్ల ఏసీపీ పరిధిలో ఇలాంటి కేసులు అనేకం నమోదయ్యాయి. ఆఖరికి నిర్మాణంలో ఉన్న ఇళ్లు, ఫామ్హౌస్ల వద్ద ఉండే సెంట్రింగ్ సామాగ్రిని కూడా పథకం ప్రకారం దోచుకెళ్తున్నారంటే ఈ ముఠాల ఆగడాలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు.
పోలీసు స్టేషన్ల వారీగా నమోదైన కీలక కేసులు..
మొయినాబాద్ పరిధిలోని పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్హౌస్లో జరిగిన ఓ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు మరో పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిధిలోని ఫామ్హౌస్లలో అర్ధనగ్న ప్రదర్శనలు, హత్యల వంటి తీవ్రమైన కేసులు కూడా వెలుగుచూశాయి.
మొకిలా పోలీస్ స్టేషన్:
జనవాడ (మీర్జగూడ) రెవెన్యూ పరిధిలోని ఒక ఫామ్హౌస్లో మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన యువతులు విదేశీ మద్యంతో దొరికిపోయారు. ఎస్‌ఓటీ పోలీసులు నిర్వహించిన నార్కోటిక్ టెస్టుల్లో ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. ఇదే పీఎస్ పరిధిలో రహదారులపై దారిదోపిడీలు కూడా చోటుచేసుకోవడం గమనార్హం.
చేవెళ్ల పోలీస్ స్టేషన్:
చేవెళ్ల పరిధిలోని ఒక ప్రీ-కాస్ట్ తయారీ ప్రాంగణంలో క్లూస్ టీం, స్థానిక తహసీల్దార్ సమక్షంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో గంజాయి సాగు వెలుగుచూసింది. అక్కడ గదుల్లో దాచిన 2.100 కిలోల ఎండిన గంజాయితో పాటు 1.50 కిలోల పచ్చి గంజాయి మొక్కలను సీజ్ చేశారు.
ఈ కేసులో బీహార్కు చెందిన నలుగురిని అరెస్ట్ చేసి ఎన్ డి పి ఎస్ చట్టం కింద బుక్ చేశారు. అలాగే ఈర్లపల్లి రెవెన్యూలోని ‘త్రిపుర రిసార్ట్‘ లో ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్ డే వేడుకలు జరుగుతుండగా పోలీసులు దాడి చేసి డ్రగ్స్ టెస్ట్ చేయగా, ఆమె డ్రైవర్కు పాజిటివ్గా తేలింది.ఇలా మచ్చుకు కొన్ని చెప్పుకోవొచ్చు.






