కాలేజీల మంజూరు కాగితాలకే..!
ఈ ఏడాది కూడా విద్యార్థులకు నిరాశే
పట్టించుకొని ప్రజాప్రతినిధులు
అవస్థలు పడుతున్న విద్యార్థులు
బెల్లంపల్లి, జూన్ 12: ఎంతో కాలంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల కోసం విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో ప్రజలు, ముఖ్యంగా విద్యార్థుల ఆకాంక్షలు నెరవేరలేదు. పదేళ్ల పాలనలో విద్యార్థుల ఆశలు ఆవిరయ్యాయి. ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా రానేవచ్చింది.
అప్పటి ఎమ్మెల్యే చిన్నయ్యను ప్రజలు ఇంటికి పంపించారు. ఆయన స్థానంలో విద్యావంతుడు ’కాకా’ వెంకటస్వామి పెద్ద కొడుకు గడ్డం వినోద్ ను బెల్లంపల్లి ప్రజలు ఆదరించారు. అధికార పీఠాన్ని ఎక్కించారు. ఇంతవరకూ అందరికీ తెలిసిందే... తాను గెలిచి రెండున్నర ఏళ్ళు దాటింది. ఈ సందర్భంలో బెల్లంపల్లి ప్రజలకు ముఖ్యంగా పేద విద్యార్థులకు ఆలస్యంగానైనా తీపి కబురు చెప్పారు.. అదేంటంటే.. తాండూర్, నెన్నెల మండలాలకు నూతనంగా జూనియర్ కళాశాలలు మంజూరు.
కాగా నూతనంగా కళాశాలలను ఏర్పాటు చేస్తూ ఇంటర్ బోర్డు డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బెల్లంపల్లి నియోజక వర్గంలో అప్పటి వరకూ బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రజల చిరకాల కోరిక, ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్. కాగా గత ఎమ్మెల్యే కూడా ప్రతి మండలానికో కాలేజీ ఏర్పాటు చేస్తామని, ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ పదేళ్ల కాలంలో ఇచ్చిన హామీలు బుట్టదాఖలు చేశారు.
అదలా ఉంచితే ప్రస్తుత ఎమ్మెల్యే మాత్రం రెండు మండలాలకు కాలేజీలను సాధించారనీ కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకొంటున్నారు. ఇది ఆయన ఘనతేమి కాదని విపక్షాలు అంటున్నారు. ప్రభుత్వ పరిపాలనా ప్రక్రియలో భాగంగా ఈ రెండు కాలేజీలు మంజూరు అయ్యాయన్న వాదనలు ఉన్నాయి. ఏదెయితేనేమి ఎమ్మెల్యే పదవి కాలంలో ఏదోచ్చినా ఆ ఘనత వారికే దక్కడం కామన్ విషయమే.. కాగా ఇందులో ఎవరికీ పేచీలేదు.. వచ్చిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందేలా చూడటం ఎమ్మెల్యే కనీస బాధ్యత. అది ఎన్నటికీ మర్చిపోవద్దు. ఈ విషయంలో ఎమ్మెల్యే పనితీరు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రకటనలకే పరిమితం...
రెండు మండలాలకు కాలేజీలను ప్రకటించి చేతులు దులుపుకున్నారు. కాలేజీలు మంజూరై ఏడాదికి దగ్గరవుతుంది. కానీ అమలుకు ఒక్క అడుగు పడటంలేదు. ఈ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుందో కూడా పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు. కాలేజీలు తీసుకొచ్చినట్టు గొప్పలు చెప్పుకొంటున్నారు. కళాశాలల ఆలస్యంపై నోరు మెదపడం లేదు. ఇప్పటికీ కళాశాల నిర్మాణానికి స్థలం ఎంపిక కాలేదు. నిర్మాణానికి బడ్జెట్ విడుదల కాలేదు. ఇలా కాలేజీల కల సాకారం అతి గతి లేకుండా పోయిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
దీంతో ఈ విద్యా సంవత్సరం కూడా ఇంటర్ విద్యాభ్యాసానికి విద్యార్థులు నోచుకోవడం లేదు. విద్యార్థులకు మరోసారి నిరాశే ఎదురయ్యింది. కళాశాలల ఏర్పాటు ఎక్కడ వేసి గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. కళాశాలల ఏర్పాటుపై ప్రజాప్రతినిధులు, అధికారుల్లో కాసింత శ్రద్ధకనిపించిన పాపాన పోలేదు. ప్రభుత్వం మొక్కుబడిగా కళాశాలలు ప్రకటించింది. దీంతో కాలేజీలు మంజూరు ఫలితం లేకుండా పోయిందనీ వాపోతున్నారు. విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థల వైపు మొగ్గు చూపకతప్పని పరిస్థితి ఉందని వాపోతున్నారు.
అదేవిధంగా బీమినీ, కన్నెపల్లి, వేమనపల్లి మండలాలకు కూడా జూనియర్ కళాశాలల మంజూరు ఆవశ్యకతను విస్మరించారన్న విమర్శలు ఉన్నాయి. ఇదికాస్త జరిగితే బెల్లంపల్లి నియోజక వర్గంలో ప్రతి మండలానికి జూనియర్ కళాశాల సౌలభ్యం అందుబాటులోకి వచ్చినట్టు అయితది. ఈ దిశగా ఎమ్మెల్యే పాటుపడాలనీ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైతే మంజూరైన కళాశాలల ఏర్పాటు జాప్యాన్నీ తక్షణమే నివారించి, కళాశాలల ఏర్పాటు పనులు శీఘ్రగతిన జరిగేలా చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






