పాత క్యాడర్‌కే..పెద్దపీట
నామినేటెడ్ పోస్టుల్లో 80 శాతం వారికే..
కొత్తవారికి 20 శాతం
- సెప్టెంబర్‌లో పదవుల భర్తీ
- గత తప్పిదాలను పునరావృతం కానివ్వం
- పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
నిజామాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసిన పాత క్యాడర్‌కు నామినేటెడ్‌తో పాటు ఇతర పార్టీ పదవుల కేటాయింపులో పెద్దపీట వేస్తామని టీపీసీసీ అధ్య క్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. మొత్తం పదవుల్లో 80 శాతం పార్టీ కోసం శ్రమించిన పాత నేతలకు, 20 శాతం కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి కేటాయిస్తామని స్పష్టం చేశారు. గతంలో పదవుల భర్తీలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుం టామని చెప్పారు.
సెప్టెంబర్‌లో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని వెల్లడిం చారు. ఆదివారం నిజామాబాద్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశా నికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన, క్రమశిక్షణతో పనిచేసిన నిబద్ధతగల కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత, కార్య కర్తల త్యాగాలు, కష్టాన్ని పార్టీ గుర్తిస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
100 సీట్లతో మళ్లీ అధికారంలోకి..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు సాధించి, మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందని మహేశ్‌కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయా లని కార్యకర్తలకు సూచించారు. నిజామాబాద్ అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో ముం దుకు సాగుతాయని తెలిపారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందన్నారు.
ఉమ్మడి రాష్ర్టంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణ యూనివర్సిటీ, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెడికల్ కళాశాల మంజూరయ్యాయని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజినీరింగ్, వ్యవసాయ కళాశాలలను తీసుకొచ్చామని, వాటిలో తరగతులు కూడా ప్రారంభమైనట్లు తెలిపారు. భీంగల్ లింబాద్రిగుట్టపై గెస్ట్ హౌస్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
అత్యధికంగా నిజామాబాద్‌కే ఇందిరమ్మ ఇండ్లు..
రాష్ర్టంలోని అత్యధికంగా నిజామాబాద్ జిల్లాకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, హైదరాబాద్ తరహాలో ఇక్కడ ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళుతున్నట్లు తెలిపారు. నిజామాబాద్ మాస్టర్ ప్లాన్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ద లేని వారు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
మరికొందరు సంస్కారహీనంగా మాట్లాడడం సరి కాదన్నారు. విమర్శలకు సమాధానం అభివృద్ధి రూపంలో చూపుతామన్నారు. ఆర్మూర్‌కు త్వరలో పామాయిల్ పరిశ్రమ రాబోతుందన్నారు. వ్యవసాయ రంగంలో రాష్ర్టంలోనే నిజామాబాద్ మేటి జిల్లాగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. సహకార సంఘాల్లో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు చైర్మన్, డైరెక్టర్ పదవులు ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామకృష్ణ, నగేష్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ తాయేర్‌బిన్ ఉందాన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్, తదితరులు పాల్గొన్నారు.






