సత్తుపల్లి విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి అంతులేదా?
వినియోగదారుల సమస్యలకు స్పందించని అధికారులు, సిబ్బంది ఫోన్ చేసినా పలకని వైనం!
సత్తుపల్లి. ఆగస్టు 23. ( విజయ క్రాంతి ) : విద్యుత్ శాఖ అంటే ప్రజల నిత్యజీవితానికి అత్యంత కీలకమైన విభాగం. కరెంట్ సరఫరాలో చిన్న అంతరాయం వచ్చినా ఇబ్బందులు పడేది సామాన్య వినియోగదారులే. అలాంటి సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించాల్సిన అధికారులు, సిబ్బంది తీరుపై సత్తుపల్లి ప్రాంతంలో వినియోగదారుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
సమస్య చెప్పేందుకు ఫోన్ చేస్తే స్పందన కరువు..
విద్యుత్ అంతరాయం, సాంకేతిక సమస్యలు, మీటర్ సమస్యలు, బిల్లులపై సందేహాలు వంటి విషయాలపై సంబంధిత అధికారులను సంప్రదించేందుకు వినియోగదారులు ప్రయత్నిస్తున్నా ఫోన్ ఎత్తకపోవడం, ఎత్తినా సరైన సమాధానం ఇవ్వకపోవడం వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమస్య తీవ్రత పెరిగిన తర్వాత పలుమార్లు ఫోన్ చేస్తే తప్ప స్పందించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఎవరి దారి వారిదేనా?
ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన శాఖలో అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం ఉందా? లేక ఎవరి దారి వారిదే అన్న చందంగా వ్యవహారం సాగుతోందా? అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. వినియోగదారుడు విద్యుత్ బిల్లు చెల్లించే సమయంలో మాత్రం గడువు, నిబంధనలు కచ్చితంగా గుర్తుచేసే శాఖ... అదే వినియోగదారుడు సమస్యతో ఫోన్ చేస్తే స్పందించాల్సిన బాధ్యతను ఎందుకు మరిచిపోతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారుల ఫోన్ ప్రజల కోసం కాదా?
ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారుల ఫోన్ నంబర్లు కేవలం కార్యాలయ రికార్డుల్లో ఉండేందుకేనా? అత్యవసర సమయంలో వినియోగదారుడు ఎవరిని సంప్రదించాలి? సమస్య పరిష్కారం కోసం ఎన్ని ఫోన్లు చేయాలి? అనే ప్రశ్నలకు విద్యుత్ శాఖ అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు అధికారులను ఇబ్బంది పెట్టేందుకు ఫోన్ చేయరు... తమ సమస్య పరిష్కారం కోసం ఫోన్ చేస్తారు. ఆ విషయం అధికారులు, సిబ్బంది గుర్తించాల్సిన సమయం వచ్చింది.
బిల్లు వసూలులో వేగం... సమస్య పరిష్కారంలో ఎందుకు ఆలస్యం?
విద్యుత్ బిల్లుల వసూళ్లలో చూపించే శ్రద్ధను ప్రజల సమస్యల పరిష్కారంలోనూ చూపించాలని వినియోగదారులు కోరుతున్నారు. ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నామంటే ప్రజలకు జవాబుదారీతనం కూడా ఉండాలని, ఫోన్కు స్పందించడం కనీస బాధ్యతగా అధికారులు భావించాలని ప్రజలు సూచిస్తున్నారు.
విద్యుత్ శాఖ ప్రజల సేవ కోసం ఉందా? లేక ప్రజలు శాఖ చుట్టూ తిరగడం కోసమా?
సత్తుపల్లి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి, వినియోగదారుల ఫిర్యాదులకు తక్షణ స్పందన ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై వస్తున్న ఆరోపణలకు సంబంధిత అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజల పన్నులు, బిల్లులతో నడిచే వ్యవస్థలో ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పడం బాధ్యత ఉపకారం కాదు.






