విదేశాలకు వరంగల్ సార్లు!
వినూత్న బోధనకు.. దక్కిన అరుదైన అవకాశం
గ్లోబల్ విద్యా విధానంపై అధ్యయనం
మహబూబాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): స్థానిక వనరులతో, సులువైన పద్ధతులతో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివిధ అంశాలపై వివరిస్తూ, విద్యా బోధన చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు కొడిపాక రమేష్, వీ.వాణి (హనుమకొండ), టీ.రాజేష్ కుమార్ (ములుగు), సిహెచ్ కృష్ణారెడ్డి (వరంగల్), తౌటమ్ స్వామి (భూపాలపల్లి) గ్లోబల్ విద్యా విధానంపై అధ్యయనం చేయడానికి విదేశీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతోపాటు విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతిభ కనబరుస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎంపిక చేసి విదేశీ విద్యా విధానాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయించే దిశగా చర్యలు చేపడుతోంది. జపాన్, ఫిన్లాండ్, సింగపూర్, వియత్నాం వంటి దేశాల్లో అమలవుతున్న ఆధునిక బోధనా పద్ధతులు, పాఠశాల నిర్వహణ, మూల్యాంకన విధానాలు, సాంకేతిక వినియోగాన్ని అధ్యయనం చేసి వాటిని రాష్ట్ర పాఠశాలల్లో అన్వయిం చాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
ప్రతిభకు ప్రాధాన్యం
విదేశీ పర్యటనకు కేవలం సీనియారిటీనే ప్రామాణికంగా కాకుండా.. ఇప్పటివరకు తరగతి గదిలో వినూత్న బోధనా విధానాలు అమలు చేయడం, విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం, పాఠశాలల్లో విద్యార్థుల హాజరును పెంచడం, ప్రత్యేక కార్యక్రమాలతో పిల్లల్లో ఆసక్తిని పెంపొందించడం, అవార్డులు, ప్రశంసలు పొందడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, గత కొన్నేళ్ల పనితీరును కూడా పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా 29 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా అందులో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఐదుగురు ఉపాధ్యాయులకు అవకాశం కల్పించారు.
సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు సింగపూర్ లో ఏడు రోజుల పాటు వివిధ విద్యా కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఎంపికైన ఉపాధ్యాయులు ఆయా దేశాల్లో అనుసరిస్తున్న సమర్థవంతమైన బోధనా విధానాలను పరిశీలించి, తిరిగి వచ్చిన అనంతరం తమ పాఠశాలల్లో వాటిని అమలు చేయాల్సి ఉంటుంది.
తరగతి గది మారితే.. విద్యార్థి భవిష్యత్ మారుతుంది
ఈ పర్యటనను సాధారణ విదేశీ టూర్గా కాకుండా ‘చూడునేర్చుకోఅమలు చేయి’ అనే విధానంలో కొనసాగించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఒక ఉపాధ్యాయుడు విదేశాల్లో నేర్చుకున్న కొత్త బోధనా పద్ధతిని తన పాఠశాలలో అమలు చేస్తే.. దాని ప్రభావం ఒక్క తరగతికే పరిమితం కాకుండా వందలాది మంది విద్యార్థులకు చేరే అవకాశం ఉంటుంది. అందుకే విదేశీ పర్యటనకు ఎంపికైన ఉపాధ్యాయుల నుంచి తిరిగి వచ్చిన తరువాత అక్కడ నేర్చుకున్న విషయాలను, ఇక్కడ అమలు చేస్తే ఈ పర్యటనల అసలు ప్రయోజనం మరింత విస్తరించే అవకాశం ఉంది.






