కాంగ్రెస్ దగాపై బీఆర్‌ఎస్ పోరు
- వెయ్యి రోజుల పాలనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
- సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులు..
- వైఫల్యాలపై ‘బాకీ కార్డుల’తో ప్రచారం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ భారీ కార్యాచరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ మేరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పార్టీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, సీనియర్ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
హామీల అమలులో వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి వర్గానికి చేరేలా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. పార్టీ శ్రేణులంతా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ మోసాలను, వైఫల్యాలను గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలతో పాటు అనేక వాగ్దానాలు చేసిందని, అధికారంలోకి వచ్చిన100 రోజుల్లోనే నెరవేరుస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. అధికారంలోకి 1000 రోజులు కావస్తున్నా ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు.
రైతు కూలీలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువతకు ప్రతి నెలా ఇస్తామన్న ఆర్థిక సహాయం హామీ అటకెక్కించారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.12 వేల కోట్లకు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువతను విస్మరించిందని, ఇప్పటికే సరూర్‌నగర్‌లో నిర్వహించిన సభ, యువ సంగ్రామ సదస్సు ద్వారా ప్రభుత్వ తీరును ఎండగట్టామని కేటీఆర్ గుర్తు చేశారు.
ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అవినీతి, అరాచకాలపై సెప్టెంబర్ 2 నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హామీలకు సంబంధించి ‘బాకీ కార్డుల’ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. ఆటో డ్రైవర్లు, ఆడబిడ్డలు, అన్నదాతలు, యువకులు, విద్యార్థులు, గిరిజనులు, దళితులు, బీసీలు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలా ప్రతి వర్గాన్ని ప్రత్యేకంగా కలిసి అర్థమయ్యేలా వివరించాలని కేటీఆర్ సూచించారు. ఒకే తరహా నిరసనలకు పరిమితం కాకుండా ఆయా వర్గాల సమస్యలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించాలని కోరారు.
హామీలే కాదు.. వైఫల్యాలనూ ఎండగట్టాలి
కేవలం హామీలనే కాదు.. 1000 రోజుల్లో ప్రభుత్వం ఏయే రంగాల్లో వైఫల్యం చెందింది, ఎక్కడ అట్టర్‌ప్లాప్ పాలన సాగించిందనే విషయాలను ప్రజలకు వివరించాలని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యలను గుర్తించి వాటిని ఎత్తిచూపాలని, హామీలకు, వాస్తవ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. కొత్త తరానికి చేరువయ్యేలా కార్యక్రమాలు ఉండాలని, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని పేర్కొన్నారు.
నిరసన కార్యక్రమాల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు.. అన్ని స్థాయిల నాయకులు పాల్గొనాలని.. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ శ్రేణులను కదిలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరభేరి మోగించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.






