సీపీఎస్‌ను రద్దు చేయాలి
సీఎం నాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
- ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తే మళ్లీ గెలిపిస్తాం
- సీపీఎస్‌ను రద్దు చేసే వరకు పోరాటం టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ
- ఎల్బీ స్టేడియంలో ‘జన జాగరణ’ వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు
- జోరువానలోనూ కొనసాగిన సభ
హైదరాబాద్ ఆగస్టు 23 (విజయ క్రాంతి): సీపీఎస్(కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం)ను రద్దు చేసి ఓపీఎస్(ఓల్డ్ పెన్షన్ స్కీం)ను పునరుద్ధరిస్తామన్న హామీని సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం పాత పెన్షన్ విధానం అమలు చేస్తే మళ్లీ కాంగ్రెస్‌నే గెలిపించుకుంటామని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూ టరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియ న్ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ పేర్కొన్నారు.
సీపీఎస్ రద్దు డిమాండ్‌తో యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభకు ‘చలో హైదరాబాద్ జన జాగరణ’ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేలాదిగా తరలివచ్చారు.
టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ అధ్యక్షతన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి ఇతర యూనియన్ నాయకుల నేతృత్వంలో జరిగిన సభ లో మహిళా ఉద్యోగులు, దివ్యాంగ ఉద్యోగులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొనగా, ఓపీఎస్ పెన్షనర్లు సైతం తరలివచ్చి సంఘీభావం తెలిపారు. జోరువానను సైతం లెక్కచేయకుండా తమ డిమాండ్‌ను బలం గా వినిపించారు.
ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ 22 ఏళ్లుగా సీపీఎస్ విధానంతో 2.6 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సతమతం అవుతున్నామని, సామాజిక భద్రత కరువై వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 5000 మంది రిటైర్మెంట్ అయ్యారని, ఏ ఒక్కరికీ కనీసం రూ.5వేల పెన్షన్ కూడా అందడం లేదని వాపోయారు. ఎక్కడో ఇరాన్ యుద్ధం జరిగితే తెలంగాణలోని సీపీఎఎస్ ఉద్యోగి ప్రాన్ అకౌంట్‌లో ఉన్న సొమ్ము స్టాక్ మార్కెట్ల పతనంతో ఆవిరి అయ్యిందని,
ఇందులో ఉద్యోగుల సొమ్మే కాకుండా ప్రభుత్వ ధనం కూడా ఉందని, మార్చి ఒక్క నెలలోనే రూ.1800 కోట్లు ఆవిరయ్యాయని పేర్కొన్నారు. 12 ఏళ్లుగా తమ సంఘం చేసిన పోరాటాల వల్లే సీపీఎస్ ఉద్యోగులకు డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సాధించుకున్నామని పేర్కొన్నారు. ఉద్యోగి అకాల మరణం చెందితే వారి కుటుంబానికి 50 శాతం పెన్షన్ అందేలా ప్రకటింపజేసిన ఘనత తమదే నన్నారు. ఇదే ఎల్పీ స్టేడియంలో నియామకాలు,
పదోన్నతులకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారని, ఓపీఎస్‌ను కూడా ఇక్కడే పునరుద్ధరించాలని కోరారు. ‘నాడు పీసీసీ అధ్యక్షుడిగా మా సమస్య తెలుసుకున్నారు. పెన్షన్ విలువను గుర్తించి సీపీఎస్ రద్దు అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. నేడు నిర్ణయాధికారం మీ చేతుల్లోనే ఉంది. ఓపీఎస్‌ను పునరుద్ధరించండి. మిమ్మల్ని మేము మళ్లీ గెలిపించుకుంటాం’ అని స్పష్టం చేశారు. జూలై 11న ప్రారంభమైన జనజాగరణ యాత్ర రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రెండు దశలుగా కొనసాగిందని తెలిపారు.
నవంబర్ 17న సత్యాగ్రహ దీక్షలు..
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిన విధంగానే తెలంగాణలోనూ పునరుద్ధరించాలని స్థితిప్రజ్ఞ కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో డే అయిన నవంబర్ 17 నాటికి ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే నవంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ సామూహిక సెలవులు పెట్టి, జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలతో నిరసన తెలియజేస్తామని తెలిపారు.
ఉద్యోగుల భవిష్యత్తు షేర్‌మార్కెట్‌పాలు
సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తు షేర్‌మార్కెట్ పాలవుతుందని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల శ్రీకాంత్ పేర్కొన్నారు. జీవితకాలం ప్రభుత్వానికి సేవ చేస్తే, ఆఖరుకు తమ పెన్షన్ నిధులను కార్పొరేట్ షేర్ మార్కెట్ దయాదాక్షిణ్యాలపై వదిలేయడం ఏమాత్రం న్యాయం న్యాయం కాదని మండిపడ్డారు. మనకు కావాల్సింది షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కాదు, భరోసానిచ్చే పాత పెన్షన్ అని పేర్కొన్నారు.
స్క్రీన్లపై హామీల ప్రదర్శన..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను భారీ స్క్రీన్లపై ప్రదర్శించారు. అలాగే రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, హిమాచల్ ప్రదేశ్ సుఖింధర్ సుఖు తెలంగాణలో ఓపీఎస్ పునరుద్ధరణపై ఇచ్చిన హామీల వీడియోలను సభా ప్రాంగణంలో ప్రదర్శించారు. ‘మాకు ఓపీఎస్ కావాలి.. అది ఇచ్చేది రేవంతన్ననే’ అనే నినాదాలతో స్టేడియం మార్మోగింది. సమావేశంలో సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నరేష్‌గౌడ్, ఉపాధ్యక్షులు కూరకుల శ్రీనివాస్, మ్యాన పవన్,మల్లికార్జున్, పోల శ్రీనివాస్, కిరణ్ ,లింగమూర్తి, నరేందర్ రావు, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.






