చుక్కల్లో.. చక్కెర..
కిలో 70కి చేరిన చక్కర ధర...
ఉట్నూర్, ఆగస్టు 23 : చక్కెర ధర రోజు రోజుకు పెరుగుతుంది. గత నెల వరకు నిలకడగా ఉన్న చక్కెర ధర ఈ నెలలో అమాంతం పెరిగింది. పది రోజుల వ్యవధిలో చక్కెర ధర రోజు రోజుకు పెరగడంతో వినియోగదారులను కలవరపెడుతుంది. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు వివిధ సందర్భాల్లో చక్కెరను వినియోగిస్తుంటారు. పెరుగుతున్న ధరతో అటు వ్యాపారులను, ఇటు కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తుంది. పది రోజుల క్రితం కిలో రూ. 40 ఉన్న ధర ప్రస్తుతం రూ. 70కి చేరింది.
ఈ ధర కూడా హోల్ సేల్ లో విక్రయిస్తున్నారు. రిటైల్ లో కిలో కు రూ. 75 చొప్పున విక్రయిస్తున్నారు. మా రుమూల గిరిజన గ్రామాల్లో రూ. 80కి పైగా అమ్ముతున్నారు. రవాణా చార్జీలు ఇతరత్ర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని మారుమూల అడవి ప్రాంతంలో చక్కర ధర కాస్త ఎక్కువ అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. అవసరాలకు సరిపడా సరఫరా లేకపోవడంతో చక్కెర ధరలు అదుపులో ఉండడం లేదని వ్యాపారులు అంటున్నారు. ఆదిలాబాద్ కు సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి చక్కెరలను దిగుబడి చేసుకుంటున్నారు.
మహారాష్ట్రలో గత రెండు మూడు ఏళ్ల నుండి చెరుకు సాగు తగ్గడంతోపాటు రైతులు అనుకున్న దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో చక్కెర ధర పెరుగుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. చెరుకు దిగుబడి తగ్గడం వల్ల చక్కెర ఉత్పత్తి పై పడిందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఇదే సమయంలో ఇతర దేశాల నుంచి చక్కెర దిగుమతి ఏది కూడా తగ్గడంతో నిలువల ప్రభావం చూపుతుందని, పెరిగిన ధరలతో సామాన్యులపై రోజువారి బడ్జెట్ ఖర్చులోనూ తేడాలు వస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు సామాన్యులపై చక్కర భారం పడకుండా ధరలు నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.






