కమీషన్ల సర్కార్
గత ప్రభుత్వం 15 శాతం, ఇప్పుడు 30 శాతం వసూళ్లు
- 22 ఏ ముసుగులో రియల్ ఎస్టేట్ దందా
- కుమ్ములాటలతో కాంగ్రెస్ సతమతం
- ఐదేళ్ల పాలనపై అనుమానాలు
- ఫీజు బకాయిలపై నేడు, రేపు దీక్ష
- సెప్టెంబర్ 17 నుంచి ‘మోదీ సేవా సంకల్ప్ అభియాన్’
- బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవి నీతి పాలనకు ప్రతీకగా మారిందని.గత ప్రభుత్వం 10నుంచి 15 శాతం కమీషన్లు తీసుకోగా, ప్రస్తుత సర్కార్ ఏకంగా 30 శాతం వసూలు చేస్తూ కమీషన్ల ప్రభుత్వంగా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు.
కాంగ్రెస్‌లోని కొందరు పెద్దలు 22ఏ ముసుగులో రియల్ ఎస్టేట్ దందా సాగిస్తున్నారని మండిపడ్డారు. అంతర్గత కలహాలతో కాంగ్రెస్ సతమతమవుతోందని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వం పూర్తికాలం కొనసాగుతుందా? అనే అనుమానాలు ప్రజ ల్లో కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లా డారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలన, దోపిడీకి పాల్పడితే.. కాంగ్రెస్ ప్రభు త్వం ‘బ్రదర్స్ సర్కార్’గా మారి దోపిడీ చేస్తుందని ఆరోపించారు. 22 ఏ పేరుతో రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్లను వేధిస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. 22ఏ భూముల సమస్యపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, పోరాటాలు నిర్వహిస్తున్నా రని తెలిపారు.
కాంగ్రెస్‌లో అవినీతి కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కావడంతోనే పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి, అంతర్గత విభేదా లు నెలకొన్నాయని, రహస్య సమావేశాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రజలు విసుగుచెందారని, ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థ కుప్పకూలిందని.. విద్యార్థులు, యువత తీవ్ర ఆందోళనలో ఉన్నారని రాంచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 12,000 కోట్లకు చేరాయన్నారు. గత ప్రభుత్వం రూ. 8,000 కోట్ల బకాయిలు పెడితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానికి మరో రూ.4,000 కోట్లు అదనంగా పెంచిందన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలలు అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాయని, విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని పేర్కొన్నారు. ఫీజు బకాయిలపై హైకోర్టు చీవాట్లు పెట్టినా పైసా విదల్చడం లేదని మండిపడ్డారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమ, మంగళవారం రెండు రోజులు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ తలపెట్టిన దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిందన్నారు. ఇందుకు సంబంధించి పోలీసుల ద్వారా లెటర్ పంపిందని రాంచందర్ రావు పేర్కొన్నారు. పోలీసుల ఆంక్షలకు భయపడేది లేదని, నిరాహార దీక్ష చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రాహుల్‌కు రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కు లేదు
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదని రాంచందర్ రావు పేర్కొన్నారు. ఎన్నికల వేళ తెలంగాణ విద్యార్థులకు ‘యూత్ డిక్లరేషన్’ పేరుతో హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జీలు జరుగుతున్నాయని, ఆయుష్ విద్యార్థులు స్కాలర్‌పిష్ కోసం పోరాటం చేస్తున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా విదేశాలకు పారిపోతూ, రోడ్లపై డ్రామాలు చేసే రాహుల్‌గాంధీకి దమ్ముంటే హైదరాబాద్‌కు వచ్చి విద్యార్థుల సమస్యలపై సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణ విద్యార్థులు రాహుల్‌గాంధీని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. జెన్‌జీ వంటి పదజాలాలు అర్బన్ నక్సల్స్, అల్ట్రా-లెఫ్ట్ భావజాలం సృష్టించినవని, దేశంలో ఉన్నది కేవలం ‘యువ భారత్’ మాత్రమేనని రాంచందర్‌రావు స్పష్టం చేశారు.
నెల రోజులు సేవా కార్యక్రమాలు
ప్రధాని నరేంద్ర మోదీ 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12 ఏళ్లు ప్రధానిగా మొత్తం 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 17 (మోదీ జన్మదినం, తెలంగాణ విమోచన దినం) నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు నెల రోజుల పాటు ప్రతి గ్రామం, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ‘మోదీ 25 సేవా సంకల్ప్ అభియాన్’ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాంచందర్‌రావు వెల్లడించారు.
రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలతో పాటు పీఎం కిసాన్, పీఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు వివరించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఢిల్లీ సమావేశంలో ప్రధాని మోదీ నాలుగు గంటల పాటు రాష్ట్ర నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేశారని, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సంస్థాగత పటిష్టతపై సూచనలు ఇచ్చారని రాంచందర్ రావు తెలిపారు.






