5 June, 2026 | 2:38 AM

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: మంచిర్యాల డీసీపీ భాస్కర్

04-06-2026 03:27 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శభాష్ నగర్ లో జరిగిన మత్తు పదార్థాల నియంత్రణ వార్డు సభలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ పాల్గొని మాట్లాడారు. డీసీపీ భాస్కర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, యువత భవిష్యత్తుపై, ఆరోగ్యంపై  కుటుంబ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాల గురించి వివరించారు.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలని సూచించారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల గురించి అవగాహన కల్పిస్తూ, ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీ మోసాలు, ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీములు, సోషల్ మీడియా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనన్నారు. ఎలాంటి అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు లేదా లింక్‌లకు స్పందించవద్దని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మహిళల భద్రత కోసం పోలీసు శాఖ చేపడుతున్న చర్యలను వివరించారు.

మహిళలు ఎలాంటి వేధింపులు ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని కోరారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్  మాట్లాడారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి, బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ సీహెచ్. కిరణ్ కుమార్,బెల్లంపల్లి కమిషనర్ తన్నీర్ రమేశ్, మహిళలు పాల్గొన్నారు.