సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ దివాకర టిఎస్
ఖమ్మం, జూలై 8 (విజయక్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. జ్వరం, జలుబు, దగ్గు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు రెండు నుంచి మూడు రోజుల పాటు కొనసాగితే వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)ను సందర్శించి వైద్య పరీక్షలు చేయించు కోవాలని కలెక్టర్ తెలిపారు.
స్వీయ చికిత్సకు పాల్పడకుండా వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధులు తీవ్రం కాకుండా నివారించవచ్చని అన్నారు. సీజనల్ వ్యాధుల నివారణలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండే పరిస్థితులను పూర్తిగా నివారించాలని, నిల్వ నీటిలోనే దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా, చికన్గున్యా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు, తలనొప్పి లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి లేదా సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి వైద్య సేవలు పొందాలని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా తమ కుటుంబాన్ని, సమాజాన్ని సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






