డూప్లికేట్ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలి- కలెక్టర్ హెమంత కేశవ్ పాటీల్
బిజినేపల్లి, జూలై 20: అనర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగకుండా, డూప్లికేట్ ఓట్ల నమోదు జరగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ హెమంత కేశవ్ పాటీల్ సూచించారు. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) డిజిటలైజేషన్ ప్రక్రియను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో రూపొందేలా చర్యలు తీసుకోవాలని, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు చేసి ఆగస్టు 3లోగా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించాలని సూచించారు. ఈ తనిఖీలో ఆర్డీవో అర్చన, తహసీల్దార్ మునీరుద్దీన్, ఎంపీడీవో కథలప్ప, బీఎల్‌వోలు, డిజిటలైజేషన్ అధికారులు పాల్గొన్నారు.






