6 April, 2026 | 2:51 PM

ఇంటికి వంద.. బడికి చందా

15-10-2025 01:04 AM

ప్రభుత్వ బడిని బతికించేందుకు గ్రామస్తుల నిర్ణయం 

మహబూబాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, ప్రాథమిక పాఠశాలల పునర్జీవానికి గ్రామస్తులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడానికి పూనుకున్నారు. స్వరాష్ట్రం సిద్ధించి, ప్రభుత్వాలు మారిన పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే ప్రభుత్వ బడి దుస్థితి మారకపోవడంతో తామే పాఠశాల జీర్ణోద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఈనెల 16న గురువారం ఉదయం 8 గంటలకు పాఠశాలలో గ్రామస్తులంతా ఏకమై గ్రామ విద్యాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయించారు.

అలాగే ‘బడి మనదే.. బడి బాధ్యత మనదే’ అనే లక్ష్యంతో ముందుకు సాగుతూ, ‘ఇంటికి వంద.. బడికి చందా’ అనే నినాదంతో బడి బాగు కోసం కార్పస్ ఫండ్ సేకరించడానికి తీర్మానించారు. ఇటీవల గ్రామస్తులు ఈ మేరకు సమావేశం ఏర్పాటు చేసుకొని పాఠశాలలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ఆ మేరకు గురువారం గ్రామస్తులు బడి బాగు కోసం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని తీర్మానించారు.

బీజం పడిందిలా..!

ఇనుగుర్తి ప్రభుత్వ పాఠశాల లో వందల మంది చదువుకొని ప్రయోజకులు కావడంతో పాటు, టీచర్ కొమరయ్య కృషితో వాలీబాల్ క్రీడలో అంతర్జాతీయ స్థాయికి అనేకమంది క్రీడాకారులు చేరుకున్నారు. భారత వాలీబాల్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన కన్నా వెంకట్ నారాయణ, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తోపాటు అనేకమంది ఈ పాఠశాలలోనే అక్షరాభ్యాసం చేసి ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ ఉపాధి రంగాల్లో కూడా ఈ గ్రామానికి చెందిన అనేకమంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారు.

అంతటి కీర్తి ప్రతిష్టలు కలిగిన ఇనుగుర్తి ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం విద్యార్థులకు సౌకర్యవంతంగా లేకపోవడంతో గ్రామస్తులు పాఠశాలల జీర్ణోద్ధరణకు నడుం బిగించారు. శిధిలమైన తరగతి గదుల పునర్నిర్మానంతో పాటు మధ్యలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయడానికి సంకల్పించారు. విద్యార్థులకు తరగతి గదులతో పాటు మౌలిక వసతులైన టాయిలెట్లు, తాగునీటి వసతి, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్ నిర్మాణంతోపాటు శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల తరగతి గదులకు మరమ్మత్తు చేయడానికి నిర్ణయించారు.

బడి బాగు కోసం గ్రామస్తుల నిర్ణయం ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో బడి మనదే.. బడి బాధ్యత మనదే నినాదంతో ముందుకు సాగుతున్న ఇనుగుర్తి మండల కేంద్రంలోని ప్రజల ఆలోచన చర్చనీయాంశంగా మారింది. జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలతో మండల పరిషత్ పాఠశాలలో కలిపి సుమారు 250 మందికి పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుండగా, కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్రామస్తుల నిర్ణయం ఏ మేరకు సఫలీకృతం అవుతుందో వేచి వేచి చూడాల్సిన పరిస్థితి.