calender_icon.png 9 February, 2026 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చమురు కొనుగోల్ డీల్

09-02-2026 02:19:02 AM

  1. భారత్, అమెరికా ద్వైపాక్షిక, వాణిజ్యాలు మెరుగు
  2. భారత ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదు
  3. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 : అమెరికా నుంచి ముడి చమురు కొనుగోలు భారత్‌కే మేలు చేస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన సోషల్ మీడియా ద్వారా భారత్--అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై వివరణ ఇచ్చారు. అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయడంలో దేశానికి ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయన స్పష్టం చేశారు.

రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించి అమెరికా వైపు మళ్లడం వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత బలపడుతుందని పీయూష్ గోయల్ అభిప్రాయ పడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగిన ఈ చర్చల్లో భారత ప్రయోజ నాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదని పీయూష్ గోయల్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ భారత ఉత్పత్తులపై విధిస్తున్న అదనపు సుంకాలను తొలగించారని ఆయన వివరించారు.

దీనివల్ల భారత ఎగుమతిదారులకు సుమారు 30 ట్రిలియన్ డాలర్ల ప్రపంచ మార్కెట్ అందుబాటులోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారతీయ రైతులకు అమెరికా మార్కెట్ వల్ల అధిక విలువ లభిస్తుందని పేర్కొన్నారు. రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఔషధాలు, వజ్రాలు, విమాన విడిభాగాల ఎగుమతిదారులకు ఈ ఒప్పందం వల్ల భారీ ఊరట లభిస్తుందని తెలిపారు. 

పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ వంటి సున్నితమైన రంగాల్లో భారత్ తన ప్రయోజనాలను పటిష్టంగా కాపాడుకుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో డేటా సెంటర్లు, కృత్రిమ మేధస్సు అభివృద్ధికి అవసరమైన అత్యాధునిక యంత్రాలను అమెరికా సరఫరా చేస్తుందని వివరించారు. అమెరికా నుంచి పెద్ద ఎత్తున విమానాల కొనుగోలుకు సంబంధించి బొయింగ్ సంస్థతో ఒప్పందాలు ముందుకు సాగుతాయని వెల్లడిం చారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.