రాజోలిలో రగులుతున్న కార్యాలయాల వివాదం!
- రాజకీయ నాయకుల స్వార్థమా..? అధికారుల నిర్లక్ష్యమా..?
- తహసీల్దార్ కార్యాలయం ఎక్కడ..?
- పాత రాజోలి-, కొత్త రాజోలి వాదనతో గ్రామంలో విభేదాలు
అలంపూర్, జూలై 24: ఒకప్పుడు వరద విపత్తును ఎదుర్కొని, పునరావాసం కోసం ఐక్యంగా పోరాడిన రాజోలి గ్రామం.. ఇప్పు డు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై రెం డు వర్గాలుగా చీలిపోయింది. తహసీల్దార్ కార్యాలయాన్ని పాత రాజోలిలోనే ఏర్పాటు చేయాలని ఒక వర్గం, పునరావాస కేంద్రం అయిన కొత్త రాజోలిలోనే నిర్మించాలని మరో వర్గంపట్టుబడుతుండటంతో వివాదం ముదిరింది. అందులో భాగంగా ఇటీవలే ని ర్వహించిన గ్రామసభలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
స్థానిక రా జకీయ నాయకులు ముందస్తుగా సమన్వయం చేయకపోవడం, అధికారులు స్థల ఎంపికపై స్పష్టత ఇవ్వకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వరద ముంపు పునరావాస కేం ద్రంగా ఉన్న కొత్త రాజోలిలో ప్రభుత్వ భూ మి, విస్తరణకు అవకాశం, వరద ముప్పు లేకపోవడం వంటి అంశాలను ఒక వర్గం ప్రస్తా విస్తుండగా.. పాత రాజోలికి చారిత్రక ప్రాధా న్యం ఉందని, ప్రజల రాకపోకలకు అనుకూలమని మరో వర్గం వాదిస్తోంది.
అయితే ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఇరువర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ అధికారులు పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాజోలి గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు విభేదాలకు కార ణం కావొద్దని అభిప్రాయపడుతున్నారు.






