29 August, 2026 | 6:43 AM

రిఫరల్స్ వద్దు.. మెరుగైన వైద్యం అందించండి

29-08-2026 02:30 AM
  1. సిబ్బందికి అనుగుణంగా ఓపీలు పెంచాలి.. 
  2. అధిక సెలవులపై కలెక్టర్ ఆగ్రహం

అలంపూర్ చౌరస్తా, ఆగస్టు 28: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు అక్కడే మెరుగైన వైద్య సేవలు అందించాలని, సరైన వైద్యం అందించకుండా కర్నూలు, ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు.శుక్రవారం అలంపూర్ చౌరస్తాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలో సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా ఓపీ సంఖ్య పెరగాలని సూచించారు.

రోగులను పలకరించి వైద్య సేవలపై ఆరా తీసిన కలెక్టర్.. ఇన్పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని,ల్యాబ్ పరీక్షలు సకాలంలో నిర్వహించి రిపోర్టులు అందించాలని ఆదేశించారు.హాజరు రిజిస్టర్ను పరిశీలించిన ఆయన పలువురు సిబ్బంది అధికంగా సెలవులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కూలిపోయిన ఆసుపత్రి ప్రహరీకి మరమ్మతులు చేయిస్తామని తెలిపారు.