30 May, 2026 | 3:10 AM

‘రైతు డిస్కం’పై రాజకీయం వద్దు

30-05-2026 02:23 AM

రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి 

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి) : ‘రైతు డిస్కం’ను రాజకీయం చేయవద్దని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రతిపక్ష పార్టీలు మాట్లాడటం సరైంది కాదని ఆయన హితవు పలికారు. రైతు డిస్కంపై ఈఆర్‌సీ నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణకు రైతు కమిషన్ చైర్మన్ కోదండెడ్డి హాజరై మాట్లాడారు. రైతు డిస్కం విషయంలో ప్రభుత్వం అందరి అభిప్రాయాలు తీసుకునే ముందుకు వెళ్తుందన్నారు. గత ప్రభుత్వం కమిషన్‌ను కూడా నియమించలేదని, రేవంత్‌రెడ్డి రైతు బిడ్డ కావడంతో రైతులకు మంచి చేయాలనే ఆలోచనతో రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. 

మోటార్లకు మీటర్లు పెడితే ఉరేయండి: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్  

రైతు డిస్కమ్ విషయంలో అవాస్తవాలను వాస్తవాలుగా ప్రతిపక్షాలు చిత్రీకరిస్తున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. రైతుల మోటార్లకు మీటర్లు పెడితే మాకు ఉరేయండి.. లేకుంటే వాళ్లకు ఉరేయండి ’ అని వ్యాఖ్యానించారు.

ఈఆర్‌సీ ప్రజాభిప్రాయసేకరణలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. గతంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కేసీఆరే మద్దతు తెలిపారని, తమ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రతిపక్షాలు పవర్ కోసం రాలేదు, పంచాయతీ కోసం వచ్చాయని ఆయన మండిపడ్డారు. రైతు డిస్కం ప్రతిపాదనను అంగీకరించి అనుమతిచాలని ఈఆర్‌సీకి విజ్ఞప్తి చేశారు. 

తప్పుదోవ పట్టిస్తున్నారు: ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రైతు డిస్కమ్‌ను ఏర్పాటు చేస్తుందని  భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 9వ ర్యాంకులో ఉన్న ఎస్‌పీడీసీఎల్ 54వ ర్యాంక్‌కు చేరిందని, ఎన్‌పీడీసీఎల్ 42 ర్యాంక్‌లో ఉందని ఎంపీ తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసిందని, వాటిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

గత ప్రభుత్వం 2017లోనే  స్మార్ట్ మీటర్ అంశం తీసుకొచ్చిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నాయకులు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.ఆర్‌డీఎస్‌ఎస్‌లో ఎక్కడా కూడా మీటర్లు పెడుతామని చెప్పలేదని, నాణ్యమైన విద్యుత్ అందించాలని రైతు డిస్కం తీసుకొస్తున్నట్లు ఎంపీ చెప్పారు. గత ప్రభుత్వం యాదాద్రి, భద్రాద్రి పూర్తి చేయలేదన్నారు. రైతు డిస్కంకు అనుమతులు ఇవ్వాలని కోరారు.