24 July, 2026 | 10:24 PM

విషవాయువుతో ఉక్కిరిబిక్కిరైన గ్రామం

24-07-2026 09:23 PM

కోవలెంట్ కాలుష్యంపై పంచాయతీ పాలకవర్గం ఆగ్రహం

పరిశ్రమ ముట్టడికి హెచ్చరిక – పీసీబీ అధికారులకు ఫిర్యాదు

నర్సాపూర్,(హత్నూర): సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని గుండ్ల మాచునూర్ గ్రామ శివారులో ఉన్న కోవలెంట్ పరిశ్రమ నుంచి విడుదలవుతున్న విషవాయువులు, వాయు–జల కాలుష్యంపై గ్రామపంచాయతీ పాలకవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం ఒక్కసారిగా భారీగా విషవాయువులు విడుదల కావడంతో గ్రామమంతా దుర్వాసన వ్యాపించి ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు. కొందరికి ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారడంతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న సర్పంచ్ శ్రీహరి, ఉపసర్పంచ్ శంకర్‌తో పాటు వార్డు సభ్యులు పరిశ్రమ వద్దకు చేరుకుని యాజమాన్య ప్రతినిధులను నిలదీశారు.

ఇష్టానుసారంగా వాయు, జల కాలుష్యాన్ని విడుదల చేయడం వల్ల గ్రామంలో నివసించే పరిస్థితి లేకుండా పోతోందని మండిపడ్డారు. పలుమార్లు సమస్యను యాజమాన్య దృష్టికి తీసుకెళ్లిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాయిలర్ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ, దుమ్ము కారణంగా గ్రామంలోని ఇళ్లపై దుమ్ము పేరుకుపోతుండటమే కాకుండా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు.

వెంటనే కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని, లేకపోతే గ్రామస్తులతో కలిసి పరిశ్రమ ముట్టడి చేపడతామని హెచ్చరించారు.అనంతరం సంగారెడ్డి జిల్లా కాలుష్య నియంత్రణ మండలి (PCB) కార్యాలయానికి వెళ్లి సంబంధిత అధికారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. పరిశ్రమపై సమగ్ర విచారణ జరిపి కాలుష్య నియంత్రణ నిబంధనలు అమలు చేయాలని, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీహరి, ఉపసర్పంచ్ శంకర్, వార్డు సభ్యులు భద్రేశ్, అంకిత, ప్రభాకర్, లక్ష్మీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.