24 July, 2026 | 10:23 PM

వైటీపీఎస్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలను నిలిపివేయాలి

24-07-2026 09:31 PM

డిప్యూటీ సీఎం భట్టికి విద్యుత్ జేఏసీ నాయకుల వినతి

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): వైటిపీఎస్(యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్) లోనే యాష్ ప్లాంట్,కోల్ ప్లాంట్ల  ప్రైవేటీకరణ ప్రతిపాదనలను నిలిపివేయాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జే ఎ సీ నాయకులు కోరారు.  మణుగూరు లోని బీటీపీఎస్ సందర్శనకు శుక్రవారం వచ్చిన ఆయనను జేఏసీ సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షులు ఎం ఏ వజీర్, బీటీపీఎస్ రీజినల్ కన్వీనర్ యస్. శ్రీనివాసరెడ్డి, నాయకులు రవి ప్రసాద్, నరేష్, తదితరులు కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలు భట్టి  దృష్టికి తీసుకుని వెళ్లారు. విద్యుత్ ఉద్యోగులకు ఈ ఏప్రిల్ నుంచి పే-రివిజన్ కమిటీ పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు.

పెండింగ్ లో ఉన్న పి ఆర్ సి ని వెంటనే అమలు చేయాలని కోరారు. సింగరేణి నుంచి బొగ్గు సరఫరా కోసం నిర్మాణం అవుతున్న  రైల్వే లైన్, ఉద్యోగుల క్వార్టర్స్ ని  వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. జెన్కోవ్యాప్తంగా ఉన్న ఇంజనీర్స్ ని రేషనలైజ్ చేసి జనరల్ ట్రాన్స్ఫర్ చేయాలని కోరారు. విద్యుత్ సంస్థల్లో కార్మికుల కోసం శాంక్షన్డ్ పోస్ట్లు మంజూరు చేయాలని పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన ఏఈ లకు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ ని పెంచాలని కోరారు.

ఎనర్జీ సెక్రెటరీ, జెన్కో సిఎండి లకు వినతిపత్రం :

బిటిపిఎస్ పర్యటనకు వచ్చిన ఎనర్జీ సెక్రెటరీ నవీన్ మిట్టల్,జెన్కో సిఎండి హరీష్ లకు జేఏసీ  నాయకులు వినతిపత్రం అందజేశారు. పి ఆర్ సి అమలు చేయాలని, వైటిపిఎస్ పాక్షిక ప్రైవేటీకరణ ప్రతిపాదనలను నిలిపివేయాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో జేఏసీ నాయకులు,కార్మిక సంఘం-1535 జెనకో ప్రెసిడెంట్ యం. శ్రీధర్, బిటిపిఎస్ ప్రెసిడెంట్  వి.ప్రసాద్, కార్మిక సంఘం- 327 అధ్యక్షులు G.కృష్ణ ఏఐటియుసి  నాయకులు శోభన్ తదితరులు పాల్గొన్నారు.