30 May, 2026 | 3:11 AM

‘క్యూర్’పై సంతృప్తి చెందేలా ఇళ్ల డిజైన్

30-05-2026 02:18 AM
  1. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు
  2. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు సౌకర్యవంతమైన, భద్రమైన, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందు కు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. క్యూర్ పరిధిలోని 24 నియో జకవర్గాల్లో తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణానికి ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అర్బన్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రూపొందించిన పలు నమూనా డిజైన్లను పరిశీలించారు. రానున్న 40 నుండి 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ, పార్కింగ్, వాణిజ్య అవసరాలు, ప్రజల జీవనశైలిని దృష్టిలో పెట్టుకొని సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి అవసరమైతే 10 అంతస్తుల వరకు భవనాలు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

హాల్, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ వంటి విభాగాల పరిమాణాల రూపకల్పనలో వాస్తు అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పేద కుటుంబాలు సంతోషంగా, ఆత్మగౌరవంతో జీవించేలా ప్రతి డిజైన్ ఉండాలన్నారు.  ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా , ఆ నియోజకవర్గ ప్రజలకు అదే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులకు సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి తో చర్చించిన అనంతరం తుది డిజైన్లను ఖరారు చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించే కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

‘క్యూర్’లో లక్ష ఫ్లాట్ల నిర్మాణం

హైదరాబాద్‌లో క్యూర్ స్కీమ్ కింద లక్ష ఫ్లాట్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహానగర పరిధిలోని దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేసేలా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ‘క్యూర్’ పరిధిలో అందుబాటు ధరల్లో ఫ్లాట్ల నిర్మాణానికి గృహనిర్మాణ శాఖ కార్యదర్శి వీపీ గౌతమ్ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా లో-ఇన్‌కమ్ గ్రూప్ (ఎల్‌ఐజీ), మిడిల్- ఇన్‌కమ్ గ్రూప్ (ఎంఐజీ) ఫ్లాట్లను నిర్మించేందుకు హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ ప్రతిష్టాత్మక పథకం కింద అర్హులైన దిగువ, మధ్య తరగతి ప్రజల కోసం మొత్తంగా ఒక లక్ష ఫ్లాట్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మొదటి విడత పైలట్ ప్రాజెక్ట్ కింద 12 వేల ఫ్లాట్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు హౌసింగ్ బోర్డుకు అనుమతులు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టులో అత్యంత నిరుపేదలు, దిగువ వర్గాల వారికి లబ్ధి చేకూర్చేలా ఎల్‌ఐజీ ఫ్లాట్లకు భూమి యూడీఎస్ (అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్) ఇవ్వడంతో పాటు, అదనంగా రూ.5 లక్షల ఆర్థిక సబ్సిడీని కూడా ప్రభుత్వం అందించనుంది. తద్వారా సామాన్యుడికి సైతం ఫ్లాట్ కొనుగోలు భారం తగ్గుతుంది.