24 July, 2026 | 10:21 PM

గరిడేపల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు విస్తృత తనిఖీలు

24-07-2026 09:20 PM

* అపరిశుభ్రంగా ఆహార పదార్థాలు తయారు చేస్తే కఠిన చర్యలు

* గరిడేపల్లి ఫేమస్ బేకరీ సీజ్ 5000 జరిమానా

* కీతవారిగూడెం ఫేమస్ బేకరీకి రూ.5,000, పంజాబీ ఫ్యామిలీ దాబాకు రూ.2,000 జరిమానా

గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కీతవారిగూడెం గ్రామంలోని ఫేమస్ బేకరీలో కుళ్లిపోయిన కేక్ విక్రయించిన ఘటన వార్తల్లో రావడంతో అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. ముందుగా కీతవారిగూడెం గ్రామంలోని ఫేమస్ బేకరీని పరిశీలించిన అధికారులు ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు. బేకరీకి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకపోవడాన్ని గుర్తించి రూ.5,000 జరిమానా విధించారు. అనంతరం గరిడేపల్లి మండల కేంద్రంలోని పంజాబీ ఫ్యామిలీ దాబాలో తనిఖీలు నిర్వహించారు.

అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించి రూ.2,000 జరిమానా విధించారు. తర్వాత గరిడేపల్లి మండల కేంద్రంలోని ఫేమస్ బేకరీ ని తనిఖీ చేసిన అధికారులు, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేయడం, గడువు ముగిసిన (ఎక్స్‌పైరీ) ఆహార పదార్థాలను వినియోగించడం, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు. దీంతో బేకరీని వెంటనే సీజ్ చేసి, 5000 వేలు ఫైన్ విధించారు.

ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రభాకర్, గరిడేపల్లి ఎస్ఐ బత్తిని శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని సూచించారు. అపరిశుభ్రంగా ఆహార పదార్థాలను తయారు చేయడం, నిల్వ ఉంచడం లేదా విక్రయించడం వంటి ఉల్లంఘనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో కీతవారిగూడెం గ్రామపంచాయతీ కార్యదర్శి జానకి, గరిడేపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు, బిల్ కలెక్టర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.