ప్రభుత్వ పాఠశాలలో చేరిన 23 మంది నూతన విద్యార్థులు
చిట్యాల, జూన్ 17: ప్రైవేట్ పాఠశాలల నుంచి చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 23 మంది విద్యార్థులు నూతనంగా చేరినట్లు గ్రామ సర్పంచ్ సురేష్ బుధవారం తెలిపారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన తల్లిదండ్రులకు గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఇంకా 63 మంది గ్రామం లోని విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారని, వారి తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ విద్యా సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, భవిష్యత్ పురోగతికి సంబంధించిన పూర్తి బాధ్యతను గ్రామ పంచాయతీ పర్యవేక్షిస్తుందని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ పాలకవర్గంపై మరింత బాధ్యత పెరిగిందని గ్రామ ప్రజలకు తెలిపారు.






