21 June, 2026 | 2:41 AM

కొత్త మెరుపులు

21-06-2026 01:23 AM

నరేశ్ ఆరుట్ల

‘లక్ష పున్నముల వెలుగులు కలిసిన నక్షత్ర కాంతి నా ముందుంటే.. దేవతలందరి దివ్యరూపములు ఒకటై ఇలాగ దర్శనమిస్తే.. ఆకాశమంత అణుబాంబు వచ్చి హఠాత్తుగా నా ముందు పడితే.. పేలిపోతుందే గుండె.. పేలిపోతుందే...’ అని రాశారు సినీ కవి చంద్రబోస్. ఆయన ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా కోసం రాసిన పల్లవి ఇది. ప్రస్తుతం సగటు మూవీ లవర్ మదిలో ఈ భావాలే మెదులుతున్నాయేమో అనిపిస్తోంది! కొత్తందాలన్నీ ఒక్కసారిగా టాలీవుడ్‌పై మెరుపు దాడి చేస్తున్న పరిస్థితిని గ్రహిస్తే, మీరూ ఈ పాటందుకోక మానరు!!  

ఈ తెలంగాణ పోరీలు ఇక హీరోయిన్లు 

తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో పాపులర్ అయిన పలువురు ఇప్పుడు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. వాళ్లలో నాగదుర్గ ఒకరు. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలైన బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందీ చిన్నది. యువ దర్శకుడు వంశీరెడ్డి ఈ సినిమాను తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి హీరోగా నటిస్తారు. ఈ నెల 25న ప్రారంభోత్సవం, వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందీ సినిమా.

నాగదుర్గ ఇప్పటికే ‘కలివి వనం’ (2025) అనే సినిమాలో తొలిసారి హీరోయిన్‌గా నటించింది. అడవుల పెంపకం నేపథ్యంలో సాగే ఈ సందేశాత్మక చిత్రంలో నాగదుర్గ ‘హరిత’ అనే ప్రాత్రలో అలరించింది. ‘లవ్ ఓ లవ్’ అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోనూ హీరోయిన్‌గా అడుగుపెట్టింది నాగదుర్గ. ప్రముఖ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్ నారాయణ్ హీరోగా నటిస్తున్న ఈ ప్రేమకథలో నాగదుర్గ కథానాయిక. 

తాజాగా డైరెక్టర్ సుకుమార్, ప్రొడ్యూసర్ బన్నీ వాస్ నిర్మాణ సారథ్యంలో హీరోయిన్‌గా ఛాన్స్ రావడం నాగదుర్గ కెరీర్‌ను మలుపు తిప్పే అంశం. ఇక ‘రాను బొంబైకి..’ అనే ఫోక్ సాంగ్ ఫేమ్ లిఖిత కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ‘సాv3’ అనే పేరుతో రూపొందుతున్న ఈ మూవీలో సామ్రాట్, డీమోన్ పవన్‌తోపాటు లిఖిత లీడ్ రోల్‌లో నటిస్తోంది. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మి కృష్ణ ఫిలింస్ బ్యానర్‌పై వీ విజయ నిర్మిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైందీ సినిమా. 

చైల్డ్ ఆర్టిస్టులుగా మెప్పించినవారు, సోషల్ మీడియా సెన్సేషనల్ గాళ్స్, ఇతర చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్లుగా వెలిగిన భామలు ఇప్పుడు తెలుగునాట తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. సారా అర్జున్ ఇప్పటికే ‘యుపోరియా’తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. చైల్డ్ ఆర్టిస్టుగా తమిళ, హిందీ, తెలుగు చిత్రాల్లో నటించిన ఈ యంగ్ బ్యూటీ తెలుగులో కథానాయికగా తొలిసారి దర్శకుడు గుణశేఖర్ తెరకె క్కించిన సోషల్ డ్రామా థ్రిల్లర్ ‘యుపోరియా’తో పరిచయమైంది.

గత ఫిబ్రవరి 6న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు యువ ప్రేక్షకులను ‘దీవాన’గా మార్చేసిన మరో ముద్దుగుమ్మ స్మేహ మణిగలై. బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా ప్రస్తుతం ప్రేక్షకాదరణ పొందుతున్న చిత్రం ‘దీవాన’. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందించిన ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువ నటుడు హర్షిత్‌రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమాతోనే తమిళ అందం స్మేహ మణిమేగలై హీరోయిన్‌గా పలుకరించింది. ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన ‘కొత్త మలుపు’లో హీరోయిన్‌గా నటించింది భైరవి ఆర్థ్యా. ఈమె స్వస్థలం అస్సాం. ఇటీవలే విడుదలైన ఈ సినిమాలో కథానాయికగా నటించిన భైరవి టాలీవుడ్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. 

స్టార్ హీరోలతో జోడీ కడుతున్న లక్కీ బ్యూటీలు.. 

పలువురు లక్కీ భామలు ఏకంగా స్టార్ హీరోలతో కలిసి తెలుగు ప్రేక్షకులను పలుకరించనున్నారు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, సంచలన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’. ‘యానిమల్’ బోల్డ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ఈ చిత్రంతో నేరుగా తెలుగు చిత్రసీమలో కాలు మోపనుంది. త్రిప్తి తెలుగులో తొలిసారి నటిస్తున్న ఈ సినిమా చూడాలంటే 2027, మార్చి 5వ తేదీ వరకు ఆగాల్సిందే.

ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న మరో చిత్రం ‘ఫౌజీ’తో ఇమాన్వి ఇస్మాయిల్ అనే ఇంకో కొత్తందం తెలుగు తెరపై మెరవనుంది. ఇమాన్వి ఒక ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ స్టార్. అద్భుత డాన్సర్, కొరియోగ్రాఫర్. ‘ఫౌజీ’ ఆమెకు తొలి తెలుగు డెబ్యూ మూవీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2027లో విడుదల కానుంది. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ‘డ్రాగన్’తో తెలుగులో అడుగుపెడుతోంది.

పలు అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రుక్మిణి ఇప్పుడు ఎన్టీఆర్‌తో నేరుగా పలుకరించనుంది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ సాగా 2027లో విడుదల కానుంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాకా’. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న ఈ సినిమాలో మొత్తం నలుగురు హీరోయిన్లు ఉంటారని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతానికి దీపికా పదుకొణె ఒకరి పేరే మేకర్స్ అధికారికంగా ప్రటించారు. ఈ ప్రాజెక్టులో తానూ భాగమయ్యానని మలయాళ నటి ఫెమినా జార్జ్ ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించింది. మోడల్ అయిన ఫెమినా 2021లో నెట్‌ఫ్లిక్స్ సూపర్ హీరో చిత్రం ‘మిన్నల్ మురళి’తో చిత్రసీమలో అడుగుపెట్టింది. ఇప్పుడు బన్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించనుంది.  

తెలుగులో ఎంట్రీ ఇస్తున్న పొరుగు పరిశ్రమ హీరోయిన్లు.. 

బాలీవుడ్ సీనియర్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో రషా తడానీ హీరోయిన్. ఈ చిత్రం జూలై 9న విడుదల కానుంది. శ్రీవిష్ణు హీరోగా వస్తున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’తో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది మహిమా నంబియార్.

అయితే, మహిమా తెలుగులో ఇంతకుముందు ‘ఇంద్రసేన’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ఆమె నటించిన పలు తమిళ, మలయాళ చిత్రాలు తెలుగులో అనువాదమయ్యాయి. అయితే, మహిమకు కథానాయికగా తెలుగులో తొలిచిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. మాస్ మహారాజా రవితేజ ఫ్యామిలీ నుంచి వస్తున్న మాధవ్ హీరోగా బిగ్‌స్క్రీన్‌పై అడుగుపెడుతున్న ‘మారెమ్మ’ సినిమా దీపా బాలుకు తెలుగులో మొట్టమొదటిది. ఈ చిత్రం వచ్చే జూలై నెలలో థియేటర్లలో సందడి చేయనుంది.

తంజావూరు తళుకుల తార దీపా బాలు ఇప్ప టికే తమిళ సినిమాలు, టీవీ, ఓటీటీలోనూ నటించింది. కన్నడ పరిశ్రమలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఏక్తా రాథోడ్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెడు తోంది. అదే విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న ‘లెగసీ’ సినిమా. సాయికిరణ్‌రెడ్డి దర్శకత్వంలో రా అండ్ ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోందీ చిత్రం. నటి మెరిన్ ఫిలిప్ తెలుగులో నటిస్తున్న తొలి సినిమా ‘అనుమాన పక్షి‘. విమల్ కృష్ణ దర్శకత్వంలో రాగ్ మయూర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ హర్రర్ కామెడీ -థ్రిల్లర్ చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా జూలై 10న విడుదల కానుంది. ‘ఇసకపట్నం‘ అనే తెలుగు వెబ్ సిరీస్‌లో కూడా మెరిన్ ఫిలిప్ కీలక పాత్ర పోషిస్తోంది.

తమిళంలో ఓ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. మెరిన్ మలయాళంలోనూ పలు సినిమాలతో అక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. సత్యదేవ్ హీరోగా రూపొందుతునన ‘రావు బహదూర్’ నటి దీపా థామస్‌కు తెలుగులో మొదటి సినిమా. ఈ చిత్రానికి వెంకటేశ్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, నమ్రతా శిరోద్కర్ సమర్పిస్తున్న ఈ సినిమా జూలై 3న విడుదల కానుంది. నటాషా సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మొదటి టాలీవుడ్ సినిమా ‘హిట్ అండ్ రన్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సాయికృష్ణ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమానే కాక సుడిగాలి సుధీర్ సరసన ‘హైలెస్సో’ అనే యాక్షన్ సినిమాలో కూడా నటాషా నటిస్తోంది.   

వీళ్లు సినిమాలకే కొత్త.. 

ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ హీరోయిన్ అయిపోతోంది. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై  రూపొందుతున్న ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అనే చిత్రంతో దివిజ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూలైలో విడుదలకు సిద్ధమవుతోంది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన తమిళ తార సాత్విక వీరవల్లి. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలుకరిం చనుంది. మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

‘సింగ్ గీతం’ సినిమాతో అహల్య బామ్రూ నటించిన మొదటి తెలుగు సినిమా. ఆమె మొదట్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తాజా మ్యూజికల్ ఫాంటసీ సినిమాతో అహల్యను తెలుగు తెరకు పరిచయం చేశారు.  ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమాలో అహల్య బామ్రూ గౌరి పాత్రలో మెప్పించింది.