25 June, 2026 | 1:32 AM

జొన్నగిరి ‘స్వర్ణగిరి’

25-06-2026 12:33 AM

ఏపీలో కొత్తగా బంగారు గని ప్రారంభం

ప్రత్యక్ష, పరోక్షంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు

దేశీయ బంగారం ఉత్పత్తి రంగానికి ఊతం

విదేశీ మారక ద్రవ్యం ఆదాలోనూ ముఖ్యపాత్ర

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ శిగలో అరుదైన ‘గని’ మకుటం చేరింది. అక్కడి ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా కర్నూలు జిల్లా జొన్నగిరిలో రూ.405 కోట్ల వెచ్చించి అరుదైన బంగారు గని ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ కేవలం ఏపీకే కాకుండా, దేశ విస్తృత ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాలకూ ఊతమివ్వనుంది.

దేశీయ బంగారం అవసరాలకు గని అత్యంత కీలకంగా మారనుంది. అంతేకాకుండా.. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనలోనూ ముఖ్యపాత్ర పోషించనుంది. మైనింగ్ కార్యకలాపాలు, ఇంజనీరింగ్, పరికరాల నిర్వహణ, లాజిస్టిక్స్, భద్రతా సేవల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. పండుగలైనా, శుభకార్యాలైనా భారతీయుల ఇళ్లలో బంగారం వినియోగం విరివిగా ఉంటుంది. బంగారాన్ని కేవలం ఆర్థికపరమైన ఆస్తి మాత్రమే కాదని, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితుల కాలంలో అదే ఆదుకునే సంజీవని అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

అందుకే బంగారం.. కూడా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి గొప్ప పునాది అంటూ అభివర్ణిస్తున్నారు. 1991 నాటి ఆర్థిక సంక్షోభంలో దేశ ఆర్థిక భద్రత కోసం, నాటి ప్రభుత్వం బంగారం నిల్వలను తాకట్టు పెట్టిన సంగతి తెలిసిందే. ఎంతోమంది మదుపర్లు కూడా తమ ఆదాయాన్ని బంగారం రూపంలోకి మార్చుకునేందుకు ఇష్టపడతారు. ఆ అవసరాలన్నింటికీ భారత్ ఎక్కువగా విదేశాలపై ఆధారపడి దిగుమతులు చేసుకుంటుంది. అందుకు యేటా బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించాల్సిన పరిస్థితి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది.

ఆర్బీఐ కూడా తన బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటూ వెళ్తున్నది. ఇలాంటి తరుణంలో ఏపీ తలపెట్టిన ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది. దేశీయంగా బంగారం ఉత్పత్తికి మరింత ఊతమివ్వనుంది. సాధారణంగా మైనింగ్ రంగానికి వచ్చే పెట్టుబడులు సాధారణంగా రహదారులు, విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ నెట్‌వర్క్, గృహ వసతుల కల్పనకు ఉపకరిస్తాయి. అందుకు భిన్నంగా ఈ ప్రాజెక్ట్ మాత్రం స్థానిక ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఒనగూర్చనుంది. దేశీయ జ్యూవెలరీ రంగానికి మద్దతుగా నిలిచేందుకు, విదేశీ మారక ద్రవ్య నిల్వల ఆదాకు సైతం ప్రాజెక్ట ఉపయోగపడనుంది.