నిజమైన శ్రీమంతుడు.. సాదే రాజు
* నియోజకవర్గంలో రూ. 60 కోట్లతో యంగ్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు
* అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
* ఏయూపీఎస్ పాఠశాల నూతన భవనం ప్రారంభం
* రూ. 16 లక్షలతో పాఠశాల మౌలిక వసతుల కల్పనకు రాజు సాయం
అచ్చంపేట: ప్రతీ ఒక్కరిలోనూ సామాజిక బాధ్యత ఉండాలని అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ ఆకాంక్షించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఏయూపీఎస్ పాఠశాల ఆవరణలో అసంపూర్తిగా మిగిలిపోయిన పాఠశాల భవనానికి పట్టణానికి చెందిన సాధే రాజు రూ.16 లక్షలతో భవనాన్ని పూర్తి చేయించారు. తరగతి గదుల్లో అవసరమైన మౌలిక వసతులను సమకూర్చారు. దాత సహకారంతో పూర్తి చేసిన నూతన భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీమంతుడు సినిమాలో హీరో రీల్ శ్రీమంతుడుగా ప్రజల ముందు నిలబడితే రియల్ శ్రీమంతుడుగా సాదే రాజు మన ముందు ఎందరికో ఆదర్శంగా తన సేవా కార్యక్రమాన్ని చేసి చూపించారని ఎమ్మెల్యే అభినందించారు. నూతన భవనాలు నాలుగేళ్ల క్రితం ప్రభుత్వ మంజూరు చేస్తే.. అసంపూర్తిగా మిగిలిన భవనాలను పూర్తిగా వినియోగంలోకి తెచ్చేందుకు అచ్చంపేట పట్టణానికి చెందిన సాదే రాజు రూ. 16 లక్షలు వెచ్చించి విద్యార్థులకు కావలసిన అన్ని మౌలిక వస్తువులతో పాటు కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేయడం ఆదర్శవంతమైన నిర్ణయం కొనియాడారు.
గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా.. ఆ శాఖను సీఎం వద్దనే ఉంచుకొని ప్రత్యేకంగా విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని గురుకులాలు ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా అన్ని సామాజిక వర్గాల విద్యార్థులు ఒకే విద్యా గొడుగు కింద చదువుకునేందుకు 104 యంగ్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు శ్రీకారం చుట్టారన్నారు.
అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు, పోల్కంపల్లిలో రూ.60 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో విద్యరంగం మరింత బలోపేతం కావాల్సిందని అభిప్రాయపడ్డారు. కేరళ చదువులో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు. దేశంలో ప్రధాన వృత్తి ఏదైనా ఉందంటే అది విద్య ఒక్కటేనని.. చదువుతోనే అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంటుందన్నారు.
* సామాజికంగా వెనుకబడిన వారికి చేయూత: సాదే రాజు
ఏయూపీఎస్ పాఠశాలలో అసంపూర్తి భవనాల పూర్తికి, ఇతర మౌలిక వసతుల కోసం రూ. 16 లక్షలు వెచ్చించిన విద్యా దాత సాదే రాజు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఒక స్థాయికి చేరుకున్న తర్వాత తోటి వారికి సాయం చేయడం విస్మరిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తన బాల్యంలో ఎదురైన ఇబ్బందులు మరెవరికి రావొద్దనే సంకల్పంతో తన వంతు సహకారం అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నానని అన్నారు. అందులో భాగంగానే తన సంపాదనలో 25 శాతం సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు కార్పొరేటర్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువు అందాలనే లక్ష్యంతోనే సాయం అందిస్తున్నానని అన్నారు.
తనకు ప్రధాన స్ఫూర్తి పట్టణంలోని బాలసదన్ పాఠశాలకు వెళ్లినపుడు చాలా చలించిపోయానని, అక్కడి విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని నాడే నిర్ణయించుకున్నారు. గతంలోనూ తాను 21 మంది ఆదివాసి పిల్లల చదువుకు ఏడాదికి రూ. 1.5 లక్షల చొప్పను సాయం అందించానని గుర్తుకు చేసుకున్నారు. ఏయూపీఎస్ పాఠశాలలోని విద్యార్థులకు టై, బెల్ట్, షూ కోసం రూ. లక్ష వెచ్చించానని, తాగునీటి కోసం వాటర్ ఫిల్టర్ను ఏర్పాటు చేశానని అన్నారు. దీంతో పాటు మూడు టాయిలెట్స్ ఏర్పాటు చేయించానన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని మీ సొంత బిడ్డల్లాగా విద్యార్థులను చూసుకోవాలని ఉపాధ్యాయులను కోరారు. అంతకుముందు ఎమ్మెల్యే, దాతకు పాఠశాల నిర్వాహకులు ఎమ్మెల్యే, దాతకు డప్పు వాయిద్యాలు, పూలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కే.బిచ్యానాయక్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేందర్, తాహాసిల్దార్ సైదులు, ఎంఈఓ జీవన్ కుమార్, బాలసదన్ పర్యవేక్షకురాలు భాగ్య, నేతలు మల్లేష్,బాలాజీ, శ్రీను, శివాజీ, శ్రీనువాసుగౌడ్ తదితరులు పాల్గొన్నారు




