నీట్ -పీజీ ఆల్ ఇండియా కోటాను తగ్గించాలి
- సీట్లు తెలంగాణ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చూడాలి
- సీట్లపై అన్ని రాష్ట్రాల కేటాయింపు గణాంకాలను విడుదల చేయాలి
- కేంద్రమంత్రికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ లేఖ
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష సందర్భంగా తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థులు, డాక్టర్ల నుంచి అందిన సమాచారం, వారి ఆందోళనల నేపథ్యంలో నీట్ పీజీలో ప్రస్తుతం ఉన్న 50 శాతం ఆల్ ఇండియా కోటాను 15 శాతానికి తగ్గించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు ఆయన లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం జిల్లాల వారీగా అనేక కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసి, వైద్య విద్యతో పాటు పీజీ సీట్లను గణనీయంగా పెంచిందని తెలిపారు. ఈ సీట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రజల నిధులు, ప్రభుత్వ వనరులు వినియోగిస్తున్నందున, వాటిలో అధిక భాగం తెలంగాణ వైద్య విద్యార్థులకు అందుబాటులో ఉండేలా విధానం ఉండాలని కోరారు. నీట్ యూజీలో 15 శాతం ఆలిండియా కోటా అమలులో ఉండగా,
నీట్ పీజీలో 50 శాతం ఆలిండియా కోటా ఉండటం సమతుల్యంగా లేదన్నారు. ప్రతి రాష్ట్రం నుంచి ఆలిండియా కోటాకు ఎన్ని ప్రభుత్వ పీజీ సీట్లు వెళ్తున్నాయి, ఇతర రాష్ట్రాల నుంచి ఎంతమంది విద్యార్థులు సీట్లు పొందుతున్నారు అనే అంశాలపై రాష్ట్రాల వారీగా పారదర్శకమైన గణాంకాలను విడుదల చేయాలన్నారు.






