గ్రామీణ విద్యార్థుల భవిష్యత్‌కు ‘డిక్షనరీ’తో చిన్న అడుగు
మూడు ప్రభుత్వ పాఠశాలల్లో 400 మంది విద్యార్థులకు ఉచితంగా పంపిణీ
దోమకొండ, ఆగస్టు 30 (విజయ క్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో బాల ప్రసాద్ దేవరగట్టు, ఆయన మిత్రులు కలిసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు చేసి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్ల్పీ పట్టు పెంచేందుకు ఉచితంగా డిక్షనరీలను అందిస్తున్నారు.
గత వారం, ఈ వారం కలిపి మూడు ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 400 మంది విద్యార్థులకు డిక్షనరీలను పంపిణీ చేశారు. విద్యార్థులు ప్రతిరోజూ కనీసం 10 కొత్త ఇంగ్లీష్ పదాలను నేర్చుకోవాలని సూచించారు. రోజుకు 10 పదాల చొప్పున నేర్చుకుంటే నెలకు 300, ఏడాదికి సుమారు 3,600 కొత్త పదాలను నేర్చుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
విద్యార్థుల ఆలోచనా విధానాన్ని మార్చడమే లక్ష్యం
డిక్షనరీల పంపిణీ కేవలం పుస్తకాలు అందించడమే కాకుండా, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఇంగ్లీష్ పరిజ్ఞానం, టెక్నాలజీపై అవగాహన, కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తిని పెంచడమే తమ లక్ష్యమని బాల ప్రసాద్ తెలిపారు. గ్రామీణ విద్యార్థులు కూడా ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రోత్సహించాలని, భవిష్యత్తులో ఉద్యోగాలు పొందడంతో పాటు ఉద్యోగాలు సృష్టించే స్థాయికి వారి ఆలోచనలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి, కొత్త అవకాశాలను సృష్టించే దిశగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.ఒక విద్యార్థి ఎదిగితే ఒక కుటుంబం ఎదుగుతుంది. ఒక కుటుంబం ఎదిగితే ఒక గ్రామం ఎదుగుతుంది. ఒక గ్రామం ఎదిగితే దేశం ఎదుగుతుంది అనే సందేశంతో తమ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని బాల ప్రసాద్ దేవరగట్టు పిలుపునిచ్చారు.






