13 May, 2026 | 2:23 AM

నీట్ రద్దు

13-05-2026 01:32 AM

పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

సీబీఐ విచారణకు ఆదేశం.. పది రోజుల్లో కొత్త షెడ్యూల్

విద్యార్థుల ఫీజు వాపస్.. ఉచితంగా మళ్లీ పరీక్ష రాసే అవకాశం

పాత రిజిస్ట్రేషన్ వివరాలే చెల్లుబాటు

న్యూఢిల్లీ, మే ౧౦: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)- 2026ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిం ది. రాజస్థాన్‌లో ప్రశ్నాపత్రం లీక్ అయిందనే ఆరోపణలు రావడంపై తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు ఆదేశించింది. అలాగే, పదిరోజుల్లో తిరిగి పరీక్ష నిర్వహించే తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేసింది. మెడికల్ సీట్ల కోసం విద్యార్థులు ఈనెల ౩న పరీక్ష రాశారు.

సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇంతలోనే పేప ర్ లీక్ అంశం తెరమీదకు వచ్చింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మరో ఊరటనిచ్చే ప్రకటన చేసింది. పరీక్ష రాసేందుకు విద్యా ర్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించనక్కర్లేదని, అంతేకాకుండా.. మే నెలలో జరిగిన పరీక్షకు చెల్లించిన ఫీజు సైతం వాపస్ ఇస్తామని తెలిపింది. పాత రిజిస్ట్రేషన్ వివరాలే రీ-ఎగ్జామ్‌కు కూడా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.

విద్యార్థులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేసింది. మరోవైపు, ఒకసారి రాసిన పరీక్షను మళ్లీ రాయడం ఒత్తిడితో కూడుకున్న పని అంటూ కొందరు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు, ప్రశ్నాపత్రం లీకేజీపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కారణాంగానే నీట్ పేపర్ లీక్ అయందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్నారు.

నిందితులను పట్టుకుంటాం: ఎన్టీఏ

పేపర్ లీక్ ఘటనలో ప్రమేయం ఉన్నవారందరినీ పట్టుకుని జైలుకు పంపిస్తామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ ప్రకటించారు. దీనిలో భాగంగానే ఇప్పటికే మహారాష్ట్రంలోని నాసిక్‌లో పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రాజస్థాన్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారని, సీబీఐ అధికారులు కూడా వెనువెంటనే రంగంలోకి దిగి విచారణ చేపడతారని స్పష్టం చేశారు.

10 లక్షలకు ప్రశ్నాపత్రం కొనుగోలు.. విద్యార్థి అరెస్ట్

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం ఓ మలుపు తీసుకుంది. కేసుతో ప్ర మేయం ఉన్న శుభం ఖైర్నార్ అనే 30 ఏళ్ల విద్యార్థిని మంగళవారం నాసిక్ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని సీబీఐకి అప్పగించారు. నిందితుడు శుభం పుణెకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.10 లక్షలకు ‘గెస్ ప్రశ్నా ప త్రాన్ని’ కొనుగోలు చేశాడని, తర్వాత శుభం అదే ప్రశ్నాపత్రాన్ని హర్యానాకు చెందిన మరో వ్యక్తికి రూ.15 లక్షలకు విక్రయించినట్లు విచారణలో తేలింది.

రాజస్థాన్ పోలీసుల దర్యాప్తు ప్రకారం.. పరీక్షకు ముందే బయటకు వచ్చిన 281 ప్రశ్నల గెస్ పేపర్‌లో అసలు ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు చాలా వరకు అసలు ప్రశ్నాపత్రంలో వచ్చాయి. ముఖ్యంగా జీవశాస్త్రంలో 90 ప్ర శ్నలు, రసాయనశాస్త్రంలో 45 ప్రశ్నలు రావడం గమనార్హం. ఏదేమైనా, సీబీఐ రం గంలోకి దిగి దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఒకటిరెండు రోజుల్లో మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకుంటుందని సమాచారం.