24 May, 2026 | 3:23 AM

జూన్ 21న జాతీయ కోలీ సమాజ్ సభ

24-05-2026 12:00 AM
  1. హాజరుకానున్న మాజీ రాష్ట్రపతి, ఢిల్లీ సీఎం, బీజేపీ ముఖ్య నేతలు
  2. ముదిరాజ్‌లు తరలి రావాలని - మురళి మోహన్ పిలుపు

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): వచ్చే నెల 21న ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో నిర్వహించే అఖిల భారతీయ కోలి సమాజ్ 12వ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ ముదిరాజ్ నాయకులు మురళి మోహన్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తాతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న కోలి సమాజ్ ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున హాజరుకానున్నట్లుగా ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ముదిరాజ్‌లు తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఇందుకు సంబంధించి ఢిల్లీలోని ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణలో ముదిరాజ్‌లు ఆర్థికంగా, సామాజికంగా వెనకబాటుకు గురవుతూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదిరాజ్‌ల హక్కులకై పోరాటం ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. అంతకు ముందు శనివారం బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌ని ప్రత్యేకంగా కలిసి పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లుగా ఆయన పేర్కొన్నారు.