తాగునీటి సమస్యను పరిష్కరించాలి
జలమండలి ఎదుట ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ధర్నా
ఎల్బీనగర్, మే 23 (విజయక్రాంతి): జంట నగరాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయం ఎదుట శనివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
తాగునీటి సరఫరాలో నెలకొన్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు తాగునీటి సరఫరా విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో దాదాపు రెండు నెలల నుంచి మంచినీటి సమస్య ఉందని, చెప్పినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే 750 ఎంజీడీ అవసరముంటే 550 ఎంజీడీ నీటిని సరఫరా చేస్తున్నారన్నారు. రోజుకు 12 వేల ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం పైపులైన్ ద్వారా తాగునీటిని ఎందుకు సరఫరా చేయడం లేదన్నారు. తాగునీటి సరఫరా విషయంలో అధికారులు చొరవ తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






