నేటి నుంచి నాగులమ్మ మహా జాతర
ఆదివాసీ సాంప్రదాయాలతో ఐదు రోజులు ప్రత్యేక పూజలు
మార్చి 5 న అమ్మవారి కళ్యాణం
మంగపేట, మార్చి 2 (విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీ నర్సాపురం గ్రామంలో శ్రీ నాగులమ్మ మహా జాతర నేడు (మంగళవారం) ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు గిరిజన, ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా జాతర నిర్వహించనున్నారు.
రెండేళ్లకొసారి పాల్గుణ శుద్ధపౌర్ణమి ఉన్న వారంలో జాతర నిర్వహించడం అనాదిగా ఆనవాయితీగా వస్తుంది. నేడు మార్చి 3న మండె మెలుగుట, మార్చి 4న గండోర్రె గుట్ట వద్ద శ్రీ నాగులమ్మ అమ్మవారికి, యెర్రెట్టల గుట్ట వద్ద సడాలమ్మకు ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. నాగులమ్మ, సడాలమ్మ అమ్మవార్లను రమణక్కపేట సమీపం లోని పవిత్ర గోదావరి నది వద్ద పుణ్య స్నానాలు కార్యక్రమం నిర్వహించి అనంతరం నాగులమ్మ ఆలయం వద్ద అమ్మవా ర్లను ప్రతిష్టిస్తారు.
మార్చి 5న నిండు జాతరలో భాగంగా పాలమాకు ఒర్రె నుండి తీసుకువచ్చిన కంక వనం (వనదేవత)కు శ్రీ నాగులమ్మ అమ్మవారికి ఎదుర్కోళ్ళు, శ్రీ నాగులమ్మ పగిడిద్ద రాజులకు కళ్యాణాన్ని గిరిజన, ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తారు. అనంతరం నాగులమ్మ తల్లి ఉపాసకులు బాడిశ రామకృష్ణ స్వామి (దేవర బాల) లోక కళ్యాణం కోసం అగ్ని గుండాలలో నడవడం తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. మార్చి 6 న అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లింపు, మార్చి 7న అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది.




