3 March, 2026 | 2:03 AM

పంచాయతీ పన్ను కట్టాల్సిందే?

03-03-2026 12:00 AM

కేసముద్రం మున్సిపల్‌లో విలీనం అయిన గ్రామాలు

గతంలో చెల్లించిన రశీదులు 

ఫేక్ అంటున్న అధికారులు 

తిరిగి చెల్లించాల్సిందేనని హుకుం

కేసముద్రం, మార్చి 2 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ ఏర్పడక ముందు విలీన గ్రామాల్లో అనేక మంది చెల్లించిన ఇంటి పన్నులో చెల్లవని, బకాయిలు చెల్లించాలంటూ మున్సిపల్ అధికారులు చెబుతున్నారని కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని పలువురు గృహ, వాణిజ్య సముదాయాల యజమానులు ఆందోళన చెందుతున్నారు. 2023 - 24 వరకు గ్రామ పంచాయతీలుగా కొనసాగిన కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, దనసరి, అమీనాపురం సబ్ స్టేషన్ తండాల్లో అప్పటి పంచాయతీ సిబ్బంది వసూలు చేసిన ఇంటి పన్నులు పంచాయతీ ఖాతాల్లో జమ చేయలేదనే సంఘటనలు ఇటీవల ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

2025 జనవరిలో కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, అమీనాపురం, ధనసరి, సబ్ స్టేషన్ తండా ఐదు  గ్రామాలను విలీనం చేసి కేసముద్రం మున్సిపాలిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటినుండి కేసముద్రం మున్సిపాలిటీగా కార్యకలాపాలను ప్రారంభించింది. అయితే ఇటీవల కొందరు గృహ యజమానులు తమ ఆస్తుల క్రయవిక్రయాలను నిర్వహించడానికి మున్సిపాలిటీ నుంచి వివిధ రకాల టాక్స్ లకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం వెళ్లగా , గతంలో చెల్లించాల్సిన పన్ను బకాయి ఉన్నట్లు చూపుతున్నట్లు చెబుతున్నారు.

తాము ప్రస్తుత 2025 26 సంవత్సరానికి మాత్రమే  బకాయి చెల్లించాల్సి ఉందని, మున్సిపాలిటీకీ ఇంటి పన్ను చెల్లించడానికి ఆన్లైన్ ద్వారా చెల్లించాలని చూస్తే అందులో గత రెండు మూడేళ్ల నుండి ఇంటి పన్ను బకాయి ఉన్నట్లు చూపిస్తుందని పలువురు పేర్కొంటున్నారు. తమ వద్ద గతంలో చెల్లించిన ఇంటి పన్ను రసీదులను తీసుకొని మున్సిపాలిటీ కార్యాలయానికి వెళితే ఆ రసీదులతో మాకు సంబంధం లేదు.. మున్సిపాలిటీ ఆన్లైన్ రికార్డు ప్రకారం ఉన్న బకాయి చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారని పలువురు గృహ యజమానులు ఫిర్యాదు చేస్తున్నారు.

మీరు ఇంటి పన్ను చెల్లించినట్లు చూపిస్తున్న రసీదులు ఫేక్ అంటూ, ఒకవేళ మీరు ఇంటి పన్ను చెల్లించినట్లయితే వెంటనే అప్పటి పంచాయతీ అధికారులు సిబ్బంది రికార్డుల్లో ఆన్లైన్ చేసేవారని, అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు అలాంటి రసీదుల వల్ల ఏలాంటి ఉపయోగం లేదని, ప్రస్తుతం చూపిస్తున్న డిమాండ్ ప్రకారం పాత బకాయిలు పూర్తిగా చెల్లించాల్సిందేనని, చెల్లించకపోతే వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నట్లు పలువురు గృహ యజమానులు పేర్కొంటున్నారు.

పంచాయతీ సిబ్బందికి తాము ఇంటి పన్ను చెల్లించి రసీదు తీసుకున్నామని, తీరా ఇప్పుడు మున్సిపాలిటీ అయిన తర్వాత అవి చెల్లవంటే ఎలా అంటూ వారు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై అప్పటి పంచాయతీ సిబ్బందిని అడగాలంటే వారు ఇక్కడ విధులు నిర్వహించడం లేదని, కొందరినీ ఫోన్లో సంప్రదిస్తే మీరు చెల్లించిన డబ్బులకు రసీదు ఇచ్చాము, గ్రామపంచాయతీ రికార్డుల్లో నమోదు చేసాము, ఇక మాకు వాటితో ఎలాంటి సంబంధం లేదని వారు కూడా చేతులెత్తేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఇలాంటి ఫిర్యాదులు కేసముద్రం మున్సిపాలిటీలో విలీనమైన ఐదు గ్రామాల పరిధిలో అనేకం వెలుగుచూస్తున్నాయి. 

తాము ఇప్పటికే చెల్లించిన ఇంటి పన్ను మళ్లీ కొత్తగా మున్సిపాలిటీ అయిన తర్వాత చెల్లించాల్సిందేనా అంటూ గృహ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు తమ వద్ద ఉన్న రసీదులు ఫేక్ అంటూ కొట్టి పారేస్తూ తమనే దోషులుగా చూస్తున్నారని పేర్కొంటున్నారు. ఇంటి పన్ను వసూళ్ల వ్యవహారంపై విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలంటూ పలువురు గృహ యజమానులు అధికారులను కోరుతున్నారు. 

పాత రసీదులతో పనిలేదు.. ఆన్లైన్ రికార్డు ప్రకారమే చెల్లించాల్సి ఉంటుంది

పాత రసీదులు చూపించి ఇంటి పన్ను బకాయిలు చెల్లించావంటే సరికాదు. మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత ఆన్లైన్ లో చూపిస్తున్న బకాయి పూర్తిగా చెల్లించాల్సిందే. గతంలో చెల్లించామని రసీదులు చూపిస్తే మేమేం చేయలేం. ఆ రసీదులకు చెల్లించిన డబ్బులను ఆన్లైన్ చేయించుకోవడంతో పాటు తమ బకాయిల వివరాలను ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత గృహ వినియోగదారులదే. ప్రాపర్టీ టాక్స్ బకాయిలు సకాలంలో చెల్లించకపోతే మున్సిపాలిటీ ఆక్ట్ ప్రకారం వడ్డీ వసూలు చేస్తాం. 

- టి.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్, కేసముద్రం

తప్పుడు రసీదులు అంటున్నారు

ప్రతి ఏటా సక్రమంగా ఇంటి పన్ను చెల్లించి గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా రసీదు తీసుకున్నాం. ఈ ఏడాది మున్సిపాలిటీకి టాక్స్ కట్టడానికి వెళితే పాత బకాయి ఉన్నట్లు చెబుతున్నారు. తాము ఇప్పటికే చెల్లించామని పంచాయతీ అప్పట్లో ఇచ్చిన రసీదులను చూపిస్తే, ఆన్లైన్లో ఆ వివరాలు లేవు కాబట్టి మీరు ఇప్పుడు పూర్తిగా బకాయిలు చెల్లించాల్సిందేనని, అవి తప్పుడు రసీదులంటూ మున్సిపల్ అధికారులు కొట్టిపారేస్తున్నారు. తప్పుడు రసీదులు సృష్టించాల్సిన అవసరం ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తే అవన్నీ మాకు చెప్పకండి.. మీ బకాయి పూర్తిగా చెల్లించాల్సిందేనంటున్నారు. ఈ విషయంపై విచారణ జరిపి న్యాయం చేయాలి. 

- ఉప్పల సౌజన్య, గృహ యజమాని, బాధితురాలు