21 July, 2026 | 8:09 AM

ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి: డాక్టర్ వై. అనూప్ రావు

20-07-2026 06:31 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించి చెరుకు రైతులు, ఫ్యాక్టరీ కార్మికులకు న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ వై. అనూప్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఎదుట నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దశాబ్దాలుగా ఫ్యాక్టరీని నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటమాడాయని విమర్శించారు. చెరుకు రైతుల కష్టాలను, ఫ్యాక్టరీ కార్మికుల ఉపాధి సమస్యలను ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు.

ఈ సందర్భంగా బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, మల్లాపూర్ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఫ్యాక్టరీ పునఃప్రారంభం విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి చిత్తశుద్ధి చూపడం లేదని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించాలని కోరారు. ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించకపోతే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో చెరుకు రైతులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.