27 June, 2026 | 10:13 PM

బేతోలులో ఘనంగా మొహరం పండుగ

27-06-2026 09:06 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు పరిధిలోని బేతోలు గ్రామం చివరి రోజు శనివారం మొహరం (పీర్ల పండుగ) వేడుకలతో భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. కుల మత భేదాలకు అతీతంగా హిందూ, ముస్లిం సోదరులు ఒకే వేదికపై కలిసిమెలిసి పండుగను ఘనంగా నిర్వహిస్తూ భారతీయ సంస్కృతిలోని మత సామరస్యాన్ని మరోసారి చాటిచెప్పారు. గ్రామమంతా భక్తి, ఆధ్యాత్మికత, ఐక్యత, సోదరభావంతో కళకళలాడింది. సంప్రదాయబద్ధంగా కొలువుదీరిన పీర్లను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

తమ కుటుంబాల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, గ్రామాభివృద్ధి, పంటల సమృద్ధి కోసం భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. రంగురంగుల దట్టీలు, కుడకలు, బెల్లంతో తయారు చేసిన బాసింగాలను సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల జయజయధ్వానాలతో పీర్ల ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగిపోయింది. ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన పీర్ల ఊరేగింపు గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డప్పు చప్పుళ్లు, సంప్రదాయ వాయిద్యాల మేళతాళాల మధ్య గ్రామ ప్రధాన వీధుల గుండా సాగిన ఊరేగింపులో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు కూడా భక్తిశ్రద్ధలతో హారతులు ఇస్తూ పీర్లను దర్శించుకోవడం కనువిందు చేసింది.

గ్రామ ప్రజలు అడుగడుగునా ఊరేగింపుకు స్వాగతం పలుకుతూ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ఉత్సవాల చివరి రోజు సంప్రదాయ పద్ధతిలో పీర్లను గ్రామ వీధుల గుండా ఊరేగించి అనంతరం నిమజ్జనం చేశారు. నిమజ్జన వేళ భక్తులు భావోద్వేగంతో ప్రార్థనలు చేస్తూ గ్రామంలో సుఖశాంతులు, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, దేశంలో శాంతి నెలకొనాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, మొహరం పండుగ త్యాగానికి, ధర్మానికి, మానవత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. హిందూ–ముస్లింలు భుజం భుజం కలిపి ఈ వేడుకలను నిర్వహించడం బేతోలు గ్రామ ఐక్యతకు నిదర్శనమని అన్నారు. ఇలాంటి పండుగలు సమాజంలో ప్రేమ, అనురాగం, పరస్పర గౌరవం, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని అభిప్రాయపడ్డారు.