29 June, 2026 | 2:47 AM

హైడ్రా తీరుపై ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం

29-06-2026 12:45 AM
  1. ప్రభుత్వ భూమా? ప్రైవేటు భూమా ? ఎంక్వయిరీ చేయాలి..
  2. బ్రోకర్ ఎవరు, వారికి సహకరించిన అధికారులు ఎవరు?

సికింద్రాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): హైడ్రాకు భూకబ్జాదారులను శిక్షించే దమ్ములేదని, దమ్ముంటే భూమి కబ్జా చేసిన వారిని జైల్లో పెట్టాలని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.ఓల్ బోయిన్ పల్లి హస్మత్ పేట్ సర్వే నెంబర్ 1 లో పేదల ఇళ్లను హైడ్రా కూల్చివేత కు వ్యతిరేకంగా మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్,బోయిన్ పల్లి సీనియర్ బిజెపి నాయకులు బానుక మల్లికార్జున్, ఏనుగుల తిరుపతి,బిజెపి నాయకులు కార్యకర్తలు, భూ నిర్వాసితులతో కలిసి ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి వారి సమస్యలు ఈటల రాజేందర్ అడిగి తెలుసు కున్నారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ..ఓల్ బోయిన్ పల్లి హస్మత్ పేట గ్రామం సర్వేనెంబర్1లో ఉన్న భూమిని కొంతమంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ భూమని, ఎక్కువ మంది ప్రభుత్వ భూమి అని, మరికొందరు ప్రైవేట్ భూమి అని చెప్తున్నారు. ఇది ఎవరి భూమి అని తేల్చాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ ది. హైడ్రా వచ్చిన మొదట్లో చెరువులను, మురికి కాలువలను,వరద కాలువలను కాపాడుతుంది అని అనుకున్నారు.

ప్రభుత్వ భూమా ? ప్రైవేటు భూమా ? ఎంక్వయిరీ చేయాలి. ప్రభుత్వ భూమి అయితే దీనిని ఎవరు లేఅవుట్ చేశారు.. బ్రోకర్ ఎవరు, వారికి సహకరించిన అధికారులు ఎవరు ? సహకరించిన రాజకీయ నాయకులు ఎవరు తేల్చి వారి మీద కేసులు పెట్టాలి,దమ్ముంటే వారిని జైళ్లో పెట్టాలి.ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు వదలం. మీ అందరికీ మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నాను అన్ని ఈటెల రాజేందర్ తెలియజేశారు.అనంతరం సర్వే నెంబర్ వన్ లో హైడ్రా అధికారులు కూల్చి వేసిన ఇళ్లను నిర్వాసితులతో కలిసి పరిశీలించారు..