23 April, 2026 | 4:07 PM

సమాంతర అభివృద్ధి మా లక్ష్యం

23-04-2026 02:56 PM

 అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో ఎంతో మేలు 

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : నగరం సమాంతరంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నామనిప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. గురువారం నగర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగరంలోని 21వ డివిజన్‌లో జనరల్ ఫండ్స్ ద్వారా రూ. 15 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఓపెన్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భవిష్యత్తు కూడా బాగుండాలనే సంకల్పంతో ప్రతి విషయంలోనూ అన్ని అలోచించి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు.

ఈ డ్రైనేజీ నిర్మాణం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న కాలువ సమస్యలు, వర్షాకాలంలో ఏర్పడే నీటి నిల్వలు, ప్రజలు ఎదుర్కొంటున్న అసౌకర్యాలు తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్ నగరాన్ని ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడం తమ లక్ష్యమని తెలిపారు. ప్రతి డివిజన్‌కు సమాన ప్రాధాన్యత ఇస్తూ, అవసరాలకు అనుగుణంగా పనులు చేపడుతున్నామని చెప్పారు.

నగరంలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు వంటి మౌలిక వసతులను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్    డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కార్పొరేటర్లు గుండా సంతోష్, రమేష్ రెడ్డి, తిరుమల వెంకటేష్,, పెద్దగొల్ల నర్సింహులు, రామస్వామి అలాగే నాయకులు మైత్రి యాదయ్య, గుండా మనోహర్, నిర్మల, శ్రీను, లక్ష్మణ్ మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.