ఇండ్లు లేని పేదలకు 100 గజాల స్థలం పట్టాలివ్వాలి
కాంగ్రెస్ ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలి
స్థలాలు కేటాయించే వరకు సీఎంను వదిలిపెట్టేది లేదు
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య
ముషీరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): ఇండ్లు లేని పేదలకు 100 గజాల స్థలం, పట్టాలు మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 19 సంవత్సరాల క్రితం ఇండ్ల పట్టాలి ఇచ్చి స్థలాలు కేటాయించకపోవడం అత్యంత దారుణమని మండిపడ్డారు.
ఈ మేరకు బుధవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ సాగర్, ఘట్కేసర్ మండలం కాచవాని సింగారంకు చెందిన వందలాది మంది పేదలు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ పేదలు గత 19 నుండి ఇళ్ల స్థలాల కోసం నిరీక్షిస్తున్నారని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలన్నారు. ఘట్కేసర్ మండలం కాచవాని సింగారంలో 1500 మందికి 2004లో పట్టాలు ఇచ్చారని, అప్పుడు ఆ స్థలం మీద కోర్టు కేసులు ఉన్నాయనే కారణంతో 22 సంవత్సరాలు జాప్యం చేశారన్నారు. అదే విధంగా మోయినాబాద్ మండలం హిమాయత్ సాగర్ లో 280 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని, కోర్టు కేసులు ఉండడంతో పొజిషన్ ఇవ్వలేదని గుర్తు చేశారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకోవాలి అన్నారు.
హైదరాబాద్ మహానగరంలో ఆరు లక్షల మంది పేద ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలేనని, వారు ఇంటి అద్దెలు చెల్లించలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఇండ్ల స్థలాలు ఇచ్చేంతవరకు సీఎంను వదిలిపెట్టేది లేదని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు జి. అనంతయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగుర్ల రామ్ దేవ్ మోడీ యాదవ్, బాకీ రవి, చరణ్ యాదవ్, కే. శ్రీను, ములుగు నవీన్, శివకుమార్ యాదవ్, బాకీ సోమయ్య, సందీప్, కుమ్మరి విట్టల్, వెంకన్న, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.






