calender_icon.png 7 February, 2026 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరాభివృద్ధి బండి సంజయ్ పాత్ర లేదనడం హాస్యాస్పదం

07-02-2026 07:54:46 PM

- మాజీ మేయర్ వై సునీల్ రావు

కరీంనగర్,(విజయక్రాంతి): నగర అభివృద్ధిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాత్ర లేదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వాఖ్యలు చేయడం హాస్యాస్పదం అని బీజేపి నాయకులు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్లో శనివారం విలేకరుల సమావేశంలో సునీల్ రావు మాట్లాడుతూ... నగరం అభివృద్ధిలో బీఆర్ఎస్ పాత్ర ఉందని ప్రజలను మభ్యపెట్టే వాఖ్యలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేయడం చాలా దుర్మార్గం అన్నారు.

2017లో కరీంనగర్ నగరపాలక సంస్థకు స్మార్ట్ సిటీ హోదా వస్తే 2020 వరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోవడానికి కారణాలు ఏమిటో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ అభివృద్ధి లో బండి సంజయ్ కుమార్ తన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చిన ప్రజల నాయకుడని కొనియాడారు. మున్సిపల్ కార్పోరేషన్ లో కార్పోరేటర్ గా పని చేసి కరీంనగర్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా నగర ప్రజలకు విశేష సేవలు అందించిన గొప్ప నాయకులు బండి సంజయ్ అని అన్నారు.

గత ఐదు సంవత్సరాల కాలంలో కరీంనగర్ నగరంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు కళ్ల ముందు కనబడుతుందన్నారు. 2017 లో కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా ప్రకటిస్తే... 2020 జనవరిలో మేము మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసే  వరకు కేవలం 19 లక్షల  రూపాయల అభివృద్ధి పనులు మాత్రమే జరిగాయన్నారు. ఆనాడు గడిచిన రెండన్నర సంవత్సరాలు స్మార్ట్ సిటి అభివృద్ధి పనులు జరగకపోవడానికి కారణం ఏంటో కమలాకర్ తెలుపాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ హోదా వచ్చినప్పటికీ 2019 లో బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచే వరకు కేంద్ర ప్రభుత్వం నుండి స్మార్ట్ సిటీ కి నిధులు విడుదల రాకపోవడానికి కారణాలు ఏంటో కమలాకర్ చెప్పాలన్నారు.

కరీంనగర్ ఎంపిగా బండి సంజయ్ కుమార్ గెలిచిన తర్వాతే మొదటి సారిగా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ కార్పోరేషన్ కు 196 కోట్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ఇచ్చినప్పటికీ రెండున్నర సంవత్సరాలు కరీంనగర్ కు నష్టం చేసింది ఎమ్మెల్యే గా ఉన్న గంగుల కమలాకర్ కాదా... అని ప్రశ్నించారు. బండి సంజయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వం నుండి 196 కోట్లు విడుదల చేసినా... సంవత్సరం పాటు ఆ నిధులను కార్పోరేషన్ కు విడుదల చేయకుండ జాప్యం చేసింది మీ రాష్ట్ర ప్రభుత్వం కాదా...? అని ప్రశ్నించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో స్థలసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే అయినా స్థల సేకరణ చేయకుండ జాప్యం చేసింది అనాడు ఎవరనేది చెప్పారని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.