అర్హులందరికీ రేషన్ కార్డులు
ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు
ఉట్నూర్, ఆగస్టు 27 ( విజయక్రాంతి ): ఉట్నూర్ మండలం లక్కారం గ్రామంలో నిర్వహించిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఖానాపూర్ శాసన సభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అన్నారు.
అదేవిధంగా రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. గుడిసెలు లేని గ్రామాలను చూడాలనేది ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే వ్యక్తులను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.
ప్రతి అర్హుడికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు అందించే బాధ్యత నాదే అని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ స్పష్టం చేశారు. లక్కారం గ్రామంలో ఇప్పటికే చాలా వరకు సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే గ్రామంలో ఉన్న చెరువును మినీ ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేసి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గ్రామంలో అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తూ లక్కారం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు.






