18 May, 2026 | 5:41 PM

రోడ్డెక్కిన అన్నదాత.. లారీలు రాక.. ధాన్యం పోక..

18-05-2026 05:16 PM

పాపన్నపేట,మే18: ధాన్యం తరలించేందుకు లారీలు ఏర్పాటు చేయడం లేదని సోమవారం మండల పరిధిలోని మిన్పూర్ రైతులు రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. దింతో మెదక్ -బోడ్మట్ పల్లి రహదారి పై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ధాన్యం తరలింపులో వాహనాలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలం అయ్యారని, వాతావరణం మార్పులతో అకాల వర్షాలు సంబవిస్తే ధాన్యం తడిసి పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని, కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోతుండగా, వాటిని తరలించేందుకు అవసరమైన లారీలు అందుబాటులో లేక రైతులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి ధాన్యం తూకం కాకపోవడంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు రాత్రింబవళ్లు అక్కడే కాపలా కాస్తున్నామన్నారు. తూకం పూర్తైన ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడంతో కొత్తగా వచ్చిన ధాన్యానికి స్థలం లేక  కేంద్రాలు కిక్కిరిసిపోయాయని వాపోయారు. లారీలు సరిపడా ఏర్పాటు చేయడంలో అధికారుల వైఫల్యం కారణంగా సమస్య మరింత తీవ్రమైందని రైతులు ఆరోపిస్తున్నారు. హమాలీలు, వాహనాల కొరతగా ఉండటంతో లోడింగ్ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని,

ధాన్యం తరలించిన లారీలు మిల్లులలో ధాన్యం బస్తాలు దింపుకోవడం లేదని దింతో ఒక్కో మిల్లు వద్ద పదుల సంఖ్యలో లారీలు ధాన్యం బస్తాలతో రెండు, మూడు రోజుల పాటు నిలిచి పోతుండడంతో లారీల కొరత ఏర్పడిందని, నిర్వాహకులు నచ్చజేప్పే ప్రయత్నం చేసినప్పటికి రైతులు ససెమీర అంటూ బిష్మించి కూర్చుడడంతో ఈ విషయం తెలుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయిన వినకుండా రోడ్డు పై బైటయించడంతో స్థానిక తహసీల్దార్ కు ఎస్ ఐ ఫోన్ లో తెలుపడంతో లారీలు కేంద్రానికి సమకూర్చుతానని తెలుపడంతో శాంతించిన రైతులు నిరసనను విరమించారు.