ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ మంజూరు చరిత్రాత్మకం
- సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్‌పోర్ట్ మంజూరు చరిత్రాత్మకమని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమ వారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ ప్రజల చిరకాల వాంఛ అయిన ఎయిర్‌పోర్ట్ సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2,278.74 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేయడం హర్షణీయమన్నారు.
గత ప్రభుత్వం 2009లో ఎయిర్‌పోర్ట్ తెస్తామని చెప్పి మోసం చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి ఎయిర్‌పోర్ట్‌ను తీసుకువచ్చారని కొనియాడారు. ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్ ప్రాంతంలోని రైతులు తమ పంటలను, కూరగాయలను ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసుకోవడానికి ఎంతో సౌలభ్యంగా ఉంటుందని, దీనివల్ల రైతులకు మంచి లాభాలు వస్తాయన్నారు. డిసెంబర్ 31 నాటికి ల్యాండ్ అక్విజిషన్, విద్యుత్ లైన్ల షిఫ్టింగ్ వంటి పనులన్నీ పూర్తి చేసి త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.
ఈ ఎయిర్‌పోర్ట్ వల్ల ఆదిలాబాద్‌తో పాటు చుట్టుపక్కల 150 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు, రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్, ఆత్మ చైర్మన్ సంతోష్ రావు, టౌన్ ప్రెసిడెంట్ కిజార్ పాషా, హిమ అభిషేక్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ బండి దేవిధాస్ చారీ, కరుణాకర్, సంజీవ్ గౌలే, టీటీడీ మాజీ బోర్డు మెంబెర్ అనిల్, జిల్లా మైనారిటీ మెంబెర్ సయ్యద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణ, ప్రేమల, జ్యోతి, కమ్మర్ బేగం, మందాకిని, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కౌన్సిలర్ చరణ్ గౌడ్, అలీమ్, ఫహీమ్, తదితరులు పాల్గొన్నారు.






