24 May, 2026 | 1:05 AM

మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం

24-05-2026 12:15 AM

మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించండి   

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క 

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): మహిళలను ఆర్థికంగా, సామాజికంగా మరిం త బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని మహిళా శిశు సంక్షేమ, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా వారోత్సవాలపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, కమిషనర్ దివ్యాదేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్య దర్శి అనితారామచంద్రన్, శాఖ డైరెక్టర్ శృతి ఓజా తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ‘ప్రజాపాలన  ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు మహిళా వారోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, సామాజిక భద్రత, విద్యా పురోగతి, మహిళల జీవనోపాధి బలోపేతం వంటి అంశాలే ప్రధా న లక్ష్యంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం మహిళా సంఘాల ఆర్థిక శక్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. 

వారోత్సవాల్లో రోజు వారీ కార్యక్రమాలు

*25వ తేదీన గ్రామస్థాయిలో నిర్మాణం పూర్తయిన100 మహిళా సంఘాల భవనాల ప్రారంభం, 8 వేల గ్రామాల్లో భవన నిర్మాణాలకు భూమి పూజ, 82 అంగన్‌వాడీ కేందా భవనాలు ప్రారంభం. స్వయం సహాయక సం ఘాల మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ, జిల్లా స్థాయిలో లోన్ మేళాలు. 

*26న మహిళా  సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న 553 ఆర్టీసీ బస్సుల ప్లాగ్ ఆఫ్, హైదరాబాద్‌లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ప్రారంభం, బాల్య వివాహాల నిరోధానికి ప్రచార కార్యక్రమాలు, సామాజిక చైతన్యం, సోషల్ మొబిలైజేషన్ కార్యక్రమాలు. 

*27వ మహిళా భద్రతపై జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, పీవోఎస్‌హెచ్(పోష్)చట్టంపై అవగాహన సదస్సులు, లోకల్ కమిటీలు, ఇంటర్నల్ కమిటీలకు శిక్షణ. 

*28న బక్రీద్ సందర్భంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. 

*29న మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ కార్యక్రమం ప్రారంభం, మానవ అక్రమ రవాణా నిరోధక విధానంపై రూపొందించిన పోస్టర్ల ఆవిష్కరణ, జిల్లా స్థాయిలో మహిళా సంఘాల జీవనోపాధి, యూనిట్ల గ్రౌండింగ్, మండల సమాఖ్యల్లో ప్రత్యేక సమావేశాలు. 

*30న అమ్మ మాట అంగన్వాడీ బాట, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు యూని ఫాం పంపిణీ, అమ్మకు అక్షరమాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.