18 July, 2026 | 3:01 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్   •   ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి   •   కరుణించని కారుమబ్బులు.. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన   •   బీజేపీతో దేశానికి ప్రమాదం   •   పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు   •   వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి   •   పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!   •   గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లి ఐదుగురు మృతి   •   పాఠశాల విద్యార్థినిలపై ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు   •   ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల్లో జాప్యం.. రైతుల ఆవేదన   •  

చైనా బొగ్గుగనిలో పేలుడు

24-05-2026 01:02 AM

90 మంది మృతి

కారకులపై కఠిన చర్యలు తప్పవన్న దేశాధ్యక్షుడు జిన్‌పింగ్

ఉత్పత్తి పెంచాలనే ఒత్తిడే 

ప్రమాదానికి కారణమంటున్న నిపుణులు

బీజింగ్, మే 23: చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ లియుషెన్యూ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ పేలుడు సంభవించి 90 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురి ఆచూకీ గల్లంతైంది. శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో గనిలో 247 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు.

ప్రమాదానికి ముందే గనిలో కార్బన్ మోనాక్సైడ్ హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. శనివారం కూడా రెస్క్యూ చర్యలను కొనసాగిస్తున్నాయి. గత దశాబ్దకాలంలో చైనాలో జరిగిన అత్యంత ఘోరమైన బొగ్గు గని ప్రమాదంగా దీన్ని భావిస్తున్నారు.

రాత్రి నుంచి కొనసాగుతున్న సహాయక చర్యల్లో గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పందించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సలు అందించాలన్నారు.

ప్రమాదానికి కారణాలపై ఆరా తీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉప ప్రధాని జాంగ్ గువోకింగ్ ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చైనా గనుల భద్రతా నిబంధనలను కఠినతరం చేసినప్పటికీ ఉత్పత్తిని పెంచాలనే ఒత్తిడి అనేక చోట్ల గనుల్లో ప్రమాదాలకు కారణమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. కాగా చైనాలో 1991లో జరిగిన బొగ్గు గని ప్రమాదంలో 148 మంది మరణించగా, 2004లో 166, 2005లో 214, 2009లో 108, 2016లో 33 మంది, 2023లో 53 మంది మరణించారు.