ఈ నెల 14న ఇల్లందులో రెండు రాష్ట్రాల స్థాయి నృత్య పోటీలు
- బ్రోచర్‌ను ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఇల్లెందు,(విజయక్రాంతి): కీర్తిశేషులు బాల & సాయి జ్ఞాపకార్థం, వెంకట్ డ్యాన్స్ అకాడమీ (VDA) మరియు వీబీసీసీ యూత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ ఆదివారం ఇల్లందులోని సీఈఆర్ క్లబ్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి నృత్య పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువ కళాకారులకు ఇటువంటి పోటీలు తమ ప్రతిభను చాటుకునేందుకు అద్భుతమైన వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమం ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.
నిర్వాహకులు మాట్లాడుతూ.. జూన్ 14వ తేదీ ఉదయం 9 గంటల నుంచి పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. వెస్ట్రన్, ఫోక్, క్లాసికల్ విభాగాల్లో జూనియర్ మరియు సీనియర్ కేటగిరీలతో పాటు సోలో, డ్యూయెట్ ప్రదర్శనలకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పోటీదారులు తమ నృత్య గీతాలను పెన్ డ్రైవ్ లేదా మొబైల్ ఫోన్‌లో తీసుకురావాలని సూచించారు. క్లాసికల్ నృత్యానికి 5 నిమిషాలు, ఫోక్ మరియు వెస్ట్రన్ నృత్యాలకు 4 నిమిషాల సమయం కేటాయించినట్లు తెలిపారు.
ప్రతి విభాగంలో కనీసం 10 ఎంట్రీలు నమోదైతేనే బహుమతులు ప్రదానం చేయబడతాయని, విజేతల ఎంపికలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రంతో పాటు ఉచిత భోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నృత్య కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పోటీలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు సీనియర్ డాన్స్ మాస్టర్స్ శేఖర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.






